Share News

Rajendra Singh: మూసీ పునర్జీవం విజయవంతమైతే ప్రపంచమే హైదరాబాద్‌ తరలివస్తుంది

ABN , Publish Date - Dec 10 , 2025 | 03:39 AM

మూసీ పునర్జీవ ప్రాజెక్టు వెనుక ఉన్న ఆశయం ఎంతో గొప్పది. సర్కారు నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పూర్తయితే ప్రపంచానికే తలమానికంగా నిలుస్తుంది...

Rajendra Singh: మూసీ పునర్జీవం విజయవంతమైతే ప్రపంచమే హైదరాబాద్‌ తరలివస్తుంది

  • కేసీఆర్‌ సర్కార్‌ కాళేశ్వరం అనవసరం

  • సగం నిధులతో చిన్న ప్రాజెక్టులు చేపడితే వేరుగా తెలంగాణ పరిస్థితి

  • ఆంధ్రజ్యోతితో రాజేంద్ర సింగ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘మూసీ పునర్జీవ ప్రాజెక్టు వెనుక ఉన్న ఆశయం ఎంతో గొప్పది. సర్కారు నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పూర్తయితే ప్రపంచానికే తలమానికంగా నిలుస్తుంది’ అని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. రాజస్థాన్‌లో 50 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయిన 23 నదుల పునరుద్ధరణలో కీలకంగా నిలిచారు. రాజేంద్ర సింగ్‌ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే.. ‘గతంలో హైదరాబాద్‌కు పరిశుద్ధమైన తాగునీరందించిన మూసీ పునర్జీవనం చాలా గొప్ప ఆలోచన. తొలిసారి ఈ ప్రాజెక్టు గురించి విన్నప్పుడు చాలా సంతోషమేసింది. ముఖ్యంగా దేశంలో జల వనరులు చాలా వేగంగా తగ్గుతున్నాయి. పలు దేశాల్లో మూసీ వంటి నదులు ఆయా దేశాల ప్రభుత్వాల చిత్తశుద్ధితో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టిన యువ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అభినందిస్తున్నా.. ఆయన అంకిత భావం చూస్తే మూసీ పునర్జీవ ప్రాజెక్టు పూర్తిగా విజయవంతమైతే ప్రపంచంలోని గొప్ప నదుల పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో మూసికి ప్రత్యేక స్థానం దక్కుతుంది. ఈ నదిని తిలకించేందుకు ప్రపంచం తరలి రావడంతో హైదరాబాద్‌ పర్యాటక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు అమలులో నా సహకారం ఉంటుంది. జల సంరక్షణలో తెలంగాణ ఎంతో మెరుగు. భౌగోళిక పరిస్థితుల వల్ల వర్షపాతమూ ఎక్కువే. కాకతీయుల నాటి చెరువులు ఇప్పటికీ సజీవం. చెరువులను కాపాడేందుకు ‘హైడ్రా’ ప్రారంభం చాలా సంతోషం. రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన గత కేసీఆర్‌ సర్కారు అందులో సగం నిధులను చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు వినియోగిస్తే తెలంగాణ పరిస్థితి ఇంకోలా ఉండేది. నా దృష్టిలో రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం అనవసరం. నీటి సంరక్షణను అన్ని దేశాలు అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తున్నాయి. గత పదేళ్లలో నేను సందర్శించిన 74 దేశాల్లో మాదిరిగా తెలంగాణలోనూ ఆ ప్రయత్నం జరుగుతోంది. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులతోపాటు మూసీ పునర్జీవంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి’ అని రాజేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 03:39 AM