Share News

Musi River Floods: ఉగ్ర మూసీ

ABN , Publish Date - Sep 27 , 2025 | 03:21 AM

మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్‌లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో సమీపంలోని ఇళ్లు మునిగాయి....

Musi River Floods: ఉగ్ర మూసీ

జంట జలాశయాల నుంచి దిగువకు భారీగా వరద నీరు

మూసారంబాగ్‌, చాదర్‌ఘాట్‌ వంతెనపై నుంచి మూసీ ప్రవాహం

రాకపోకల నిలిపివేత.. బాపూఘాట్‌ వద్ద భారీగా వరద

చాదర్‌ఘాట్‌ వద్ద వరద ఉధృతికి మునిగిన 200 నివాసాలు

చేతికందిన వస్తువులతో కట్టుబట్టలతో రోడ్డుపైకి బాధితులు

మొత్తంగా 600 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు

భూపాలపల్లి జిల్లాలో గోడ కూలి నిద్రిస్తున్న మహిళ దుర్మరణం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) : మూసీ ఉగ్రరూపం దాల్చింది. ఆ తీవ్రతకు హైదరాబాద్‌లోని మూసీ పరిసర ప్రాంతాలు వణికిపోతున్నాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో సమీపంలోని ఇళ్లు మునిగాయి. బాధితులు హాహాకారాలు చేస్తూ నివాసాల్లోంచి బయటపడ్డారు. మూసీ ఉధృతికి నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్‌ బస్టాండ్‌లోకి వరద నీరు పోటెత్తింది. బస్టాండ్‌లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్‌ఘాట్‌ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి. చేతికందిన వస్తువులను పట్టుకొని.. కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్డుమీదికొచ్చారు. తమ సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. చాదర్‌ఘాట్‌ సమీపంలోని వినాయకవీధి, రసూల్‌పురా ప్రాంతాల్లోంచి 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరిలో చాదర్‌ఘాట్‌ శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో ఉన్న 55 మందిని గోడే కీ ఖబర్‌ ప్రాంతంలోని కమ్యూనిటీ కేంద్రానికి తరలించారు. చాదర్‌ఘాట్‌ కాజ్‌వేపై నుంచి నీరు వెళుతుండటంతో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. కాజ్‌వేను ఏ క్షణమైనా మూసివేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మూసారంబాగ్‌ వంతెనపై నుంచి నాలుగు అడుగుల మేర వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. గోల్నాక మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించారు. హుస్సేనీఆలంలోని శివాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గండిపేటపై పొద్దుటూరు, చినమంగళవారం వంతెనలు మూసివేశారు. సుల్తాన్‌పూర్‌-ఆమడపూర్‌ మధ్య కేతిరెడ్డిపల్లి వద్ద.. గండిపేట కల్వర్టు వద్ద, మంచిరేవుల కల్వర్టు వద్ద, రాయల్‌ ఫంక్షన్‌హాల్‌ మిలటరీ ఏరియా వద్ద రాకపోకలు నిలిపివేశారు. బాపూఘాట్‌ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. జంట జలాశయాలకు ఎగువ నుంచి 8వేల క్యూసెక్కుల చొప్పున వరద వస్తోంది. హిమాయత్‌సాగర్‌ ఆరు గేట్లను ఎత్తి 14,446 క్యూసెక్కులను దిగువకు వదిలారు.


గండిపేట జలాశయం నుంచి 12గేట్లు ఎత్తి 10,668 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు వాటర్‌ బోర్డు అధికారులకు రానున్న రెండ్రోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్‌ను మరోసారి వర్షం ఉక్కిరిబక్కిరిచేసింది. నగరవ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి రాత్రిదాకా పలుచోట్ల భారీగా వర్షం పడింది. జనం ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఐటీ కారిడార్‌ పరిధిలోనే 26 ప్రాంతాల్లో రోడ్లు వరదతో చెరువులను తలపించాయి.. భారీ వర్షం కారణంగా బతుకమ్మ కుంట జాతికి అంకితమిచ్చే కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను సీఎం రేవంత్‌ రెడ్డి వాయిదా వేసుకున్నారు. అయితే ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం కల్పించాలని సైబరాబాద్‌ ట్రాపిక్‌ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేయడం కొంత మేర ట్రాఫిక్‌ ఇబ్బందులను నివారించినట్లయింది. ట్రాపిక్‌ పోలీసుల సూచన మేరకు ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోంకు అనుమతివ్వడంతో ఉద్యోగులు శుక్రవారం ఇళ్ల నుంచే పనులు చేశారు. జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 10.2 సెంమీ వర్షపాతం నమోదైంది.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. ఈ మేరకు రాజధానిలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. వరుస వర్షాలపై మంత్రి పొంగులేటి.. సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


విషాదాలు..

ఆ వాగు ఉప్పొంగి ప్రవహించి.. దారిని మూసివేయకపోయి ఉంటే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ వృద్ధుడు సకాలంలో వైద్యం అంది బతికేవాడేమో! ఆసిఫాబాద్‌ జిల్లా జన్కాపూర్‌కు చెందిన పవార్‌ బిక్కునాయక్‌ (78)కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. అతడిని కుటుంబసభ్యులు ఆటోలో ఎక్కించుకొని కెరమొరి ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో అనార్‌పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనం దాటే పరిస్థితి లేకపోయింది. దీంతో బిక్కునాయక్‌ను కొందరు తమ భుజం మీద ఎక్కించుకొని వాగు దాటే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే అతడు ప్రాణాలు విడిచాడు. వరుసగా కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం బెగ్లూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఇంటిగోడ కూలింది. ఆ శిథిలాలు మీద పడడంతో నిద్రిస్తున్న మంద లక్ష్మి మృతిచెందింది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్‌పూర్‌ సమీపంలో కొత్తపల్లి చెరువు అలుగును దాటుతూ కొత్తపల్లికి చెందిన చింతకింది రవి (36), ఎదిరింటి ప్రేమ్‌ అనే ఇద్దరు కొట్టుకుపోయారు. ప్రేమ్‌ ఓ చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడగా.. రవి గల్లంతయ్యాడు. రంగారెడ్డి జిల్లా గుర్రుంపల్లికి చెందిన ఎంకేపల్లి సత్యయ్య (54) ఇంద్రనగర్‌ శివారులో వాగుదాటేందుకు ప్రయత్నిస్తూ నీళ్లలో కొట్టుకుపోయాడు. కొద్దిదూరంలో చెట్ల పొదలకు తట్టుకున్న సత్యయ్య మృతదేహం కనిపించింది.

ఈఎన్‌టీ ఆస్పత్రిలోకి వరద

కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో భారీ వరద నీరు చేరింది. ఆస్పత్రి ఓపీకారిడార్‌లోకి నీరు రావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రి గేటు వద్ద డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడంతో వివిధ ప్రాంతాల్లోంచి వరదంతా ఆస్పత్రిలోకి చేరింది. దుర్వాసన ఆస్పత్రిలోని వార్డులకు వ్యాపించడంతో వైద్యులు, రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. డ్రైనేజీ నీరు ఆస్పత్రిలోకి పోటెత్తినా జీహెచ్‌ఎంసీ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆనంద్‌ ఆచార్య ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు, హైడ్రా కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని రోగులు, వారి సహాయకులు వాపోయారు.

శంషాబాద్‌లో విమానాల రాకపోకలకు అంతరాయం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారుల వివరాల ప్రకారం.. ముంబై, కోల్‌కతా, పుణె నుంచి శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానాలను విజయవాడకు దారి మళ్లించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన సర్వీసుల దారి మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరో 2 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం తో రాష్ట్రంలో మరో 2 రోజులపాటు వర్షాలు కురుస్తాయ ని.. కొన్ని జిల్లాల్లో అతిభారీగా పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

4.jpg3.jpg5.jpg2.jpg

Updated Date - Sep 27 , 2025 | 03:21 AM