Share News

Moosi River Development Work to Begin: మూసీ అభివృద్ధి పనులు మార్చిలో..!

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:43 AM

మూసీ నదీ తీరప్రాంత అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కారు..

Moosi River Development Work to Begin: మూసీ అభివృద్ధి పనులు మార్చిలో..!

  • రూ.5800 కోట్ల అంచనాలతో తొలిదశ పనుల్ని ప్రారంభించేందుకు సర్కారు సన్నాహాలు

  • ఏడీబీ నుంచి రూ.4100 కోట్ల రుణానికి ఆమోదం

  • ఉస్మాన్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 11 కి.మీ.

  • హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ దాకా 9 కి.మీ.

  • వారం రోజుల్లో పూర్తిస్థాయి డీపీఆర్‌!

  • ఇప్పటికే సిద్ధమైన అభివృద్ధి నమూనాలు

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్ర జ్యోతి): మూసీ నదీ తీరప్రాంత అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సర్కారు.. మార్చి నెలలో పనులు మొదలుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. సుమారు రూ.5800 కోట్ల అంచనాలతో తొలి దశ పనులు ప్రారంభించాలని యోచిస్తోంది. ఇప్పటికే రూ.4100 కోట్ల రుణం అందించేందుకు ఏడీబీ నుంచి ఆమోదం లభించింది. తొలిదశ పనుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) సైతం వారం రోజుల్లో పూర్తికానుంది. ఉస్మాన్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 11 కి.మీ., హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 9 కి.మీ. మేర ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మూసీ అభివృద్ధి నమూనాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించే రీతిలో డిజైన్లు రూపొందించారు.

మూసీ ప్రణాళిక ఇలా..

అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్‌ నగరం మధ్య నుంచి నల్లగొండ జిల్లాలో ప్రవేశించి, వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలిసే మూసీ నది మొత్తం 240 కి.మీ. మేర ప్రవహిస్తుంది. అందులో 55 కి.మీ. హైదరాబాద్‌ నగరం చుట్టూ ప్రవహిస్తోంది. దీన్ని 5 భాగాలుగా విడగొట్టారు. ఓఆర్‌ఆర్‌ వెస్ట్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 17 కి.మీ., బాపూఘాట్‌ నుంచి పురానాపూల్‌ వరకు 10, పురానాపూల్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 5, ఎంజీబీఎస్‌ నుంచి ఉప్పల్‌ వరకు 10, ఉప్పల్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ ఈస్ట్‌ వరకు 13, మొత్తం 55 కి.మీ. మేర దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. నదిలో స్వచ్ఛమైన నీటి ప్రవాహం ఉండేలా.. మూసీని గోదావరి నదితో అనుసంధానం చేస్తున్నారు. అలాగే మూసీలోకి శుద్ధి చేసిన నీటిని వదిలేలా కొత్త ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. నదీ పరీవాహకంలో వరద నియంత్రణ ఏర్పాట్లు, వారసత్వ సంపద అభివృద్ధి, అత్యాధునిక పార్కులు, వాక్‌ టు వర్క్‌ తరహాలో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇందు కోసం గ్రీన్‌ మాస్టర్‌ ప్లాన్‌, భూ వినియోగ, ఆర్థిక బృహత్‌ ప్రణాళికలు, ఆకర్షణీయంగా కనిపించే అభివృద్ధి నమూనాల ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌లో మూసీని అనుసంధానం చేస్తూ వంతెనల నిర్మాణం, జీవనోపాధుల కల్పన విధానంలో పలు నమూనాలు సిద్ధం చేశారు.


ఇవిగో నమూనాలు..

మూసీ అభివృద్ధికి సంబంధించి రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కొన్ని నమూనాలను రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న ఆ న మూనాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్నా యి. మూసీ ముఖద్వారం నుంచి గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు నమూనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. నడక వంతెనల నమూనాలు, స్టాట్యూఆఫ్‌ పీస్‌, నేషనల్‌ మ్యూ జియం, నాలెడ్జ్‌హబ్‌, చేనేత ప్రోత్సాహక కేంద్రం, ధ్యానగ్రామం, ప్రజా వినోద కేంద్రాలు, ఘాట్లకు సంబంధించిన నమూనాలను రూపొందించారు.

Updated Date - Nov 25 , 2025 | 04:43 AM