Share News

మునుగోడును కలెక్టర్‌ దత్తత తీసుకోవాలి

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:44 AM

మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి సూచించారు.

మునుగోడును కలెక్టర్‌ దత్తత తీసుకోవాలి
గట్టుప్పల్‌లో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు అందజేస్తున్న కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

గట్టుప్పల్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి సూచించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి లబ్ధిదారులకు బుధవారం రేషన్‌కార్డులు అందజేశారు. కొత్త మండలంగా ఏర్పడ్డ గట్టుప్పల్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు, సరైన రోడ్లు లేవని తెలిపారు. సమయం ఇస్తే మునుగోడు నియోజకవర్గ సమస్యలపై ఒక రోజు చర్చిస్తామని తెలిపారు. గట్టుప్పల్‌ మండలం కోసం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయం చేశానన్నారు. తన రాజీనామాతో గత ప్రభుత్వం గట్టుప్పల్‌ మండలం, చండూరు డివిజన్‌ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివాసరెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌. ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్‌ రాములు, ఎంపీడీవో మాధవరెడ్డి, నాయకులు వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, రావుల రమేష్‌, జగన్నాథం, కర్నాటి శ్రీనివాసు, రావుల పర్వతాలు. తదితరులు పాల్గొన్నారు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తా

మునుగోడు, జూలై 23(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీ ఇచ్చా రు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన రేషన్‌కార్డుల పంపిణీ చేశారు. పథకాలు నిజమైన పేదలకే అందాలన్నారు. అర్హులకు అందాల్సిన పథకాలు అనర్హులకు అందడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులను గుర్తించి చక్కదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలను సడలించాలని తద్వారా పేదలకు మేలు జరుగనుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నెల్లికంటి సత్యం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అమలు చేసేవన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కాలన్న ఉద్దేశం ఉండటం, ఎమ్మెల్యే కృషి చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాఫ్క్సాబ్‌ డైరెక్టర్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, చండూరు ఆర్డీవో శ్రీదేవి, మునుగోడు తహసీల్దార్‌ ఎన్‌. నరేష్‌, ఎంపీడీవో ఎం. విజయ్‌భాస్కర్‌, చండూరు మార్కెట్‌ చైర్మన్‌ దోటి నారాయణ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ, మహత్మా జ్యోతిబా పూలే బాలికల, బాలుర గురుకుల విద్యాలయాలపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముంపు గ్రామాల ప్రజల త్యాగాలు మరువరానివి

మర్రిగూడ: రిజర్వాయర్‌ నిర్మాణం కోసం నిర్వాసితులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొనియాడారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలో చేపడుతున్న చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం బాధిత భూనిర్వాసితులకు బుధవారం మునుగోడు క్యాంప్‌ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసిడింగ్‌ పత్రాలు అందజేశారు. మునుగోడు నియోజకవర్గంలో సాగు, తాగునీరు అందించేందుకు మీ భూములు త్యాగం చేశారని ఎమ్మెల్యే అన్నారు.

Updated Date - Jul 24 , 2025 | 12:44 AM