Telangana State Election Commission: నెల రోజుల్లో మునిసిపల్ ఎన్నికలు?
ABN , Publish Date - Dec 30 , 2025 | 05:50 AM
రాష్ట్రంలో మునిసిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. గత ఏడాది జనవరిలోనే పురపాలక సంఘాల పదవీ కాలం ముగిసింది.
హైదరాబాద్ మినహా మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిపేందుకు సన్నద్ధం
నేటి నుంచే వార్డుల విభజన
10న తుది ఓటరు జాబితా వెల్లడి
షెడ్యూల్ విడుదల చేసిన ఎస్‌ఈసీ
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మునిసిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. గత ఏడాది జనవరిలోనే పురపాలక సంఘాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ ఎన్నికలు ఎప్పుడు చేపడతారనే విషయమై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) పురపాలికల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 123 మునిసిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేయడంతో పాటు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు ఎస్‌ఈసీ కమిషనర్ రాణి కుముదిని సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌ను నిర్ణయించారు. దీని ప్రకారం జనవరి 10న పోలింగ్ ేస్టషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) 2025 అక్టోబరు 1 నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన ఓటరు జాబితాను ఆధారంగా చేసుకొని మునిసిపాలిటీల పరిధిలో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో ఉన్న ఫార్మాట్‌లోనే వార్డుల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు.
ఓటరు జాబితా షెడ్యూల్ ఇలా
ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలోని వివరాల ఆధారంగా మునిసిపాలిటీ, కార్పోరేషన్ల వారీగా పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ, కొత్తవాటి గుర్తింపు ప్రక్రియను 30న మంగళవారం చేపడతారు. 31న బుధవారం వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను విభజిస్తారు. జనవరి 1 నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం, ఓటర్ల పేర్లు, చిరునామాలపై అభ్యంతరాల స్వీకరించడం చేస్తారు. ఐదున మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల(కలెక్టర్ల) ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, ఓటరు జాబితాకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలను చర్చిస్తారు. తర్వాత మార్పులు చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటరు జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారు.
నెల రోజుల్లో ఎన్నికలు?
పంచాయతీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మునిసిపాలిటీ ఎన్నికల ప్రక్రియను నెల రోజుల్లో చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. పరిషత్ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా? పురపాలికల ఎన్నికలే తొలుత నిర్వహిస్తారా? అన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతోంది.