Share News

Charalapalli Drugs Case: చర్లపల్లి డ్రగ్స్‌ కేసు..తొలుత బంగ్లాదేశీని పంపిన డ్రగ్స్‌ ముఠా!

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:05 AM

చర్లపల్లిలో మెఫిడ్రిన్‌ డ్రగ్స్‌ వ్యవహారం గుట్టురట్టు చేయడానికి మహారాష్ట్ర పోలీసులు పక్కా స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది..

Charalapalli Drugs Case: చర్లపల్లి డ్రగ్స్‌ కేసు..తొలుత బంగ్లాదేశీని పంపిన డ్రగ్స్‌ ముఠా!

  • వెంబడించి ఆమెను పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు

హైదరాబాద్‌సిటీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లిలో మెఫిడ్రిన్‌ డ్రగ్స్‌ వ్యవహారం గుట్టురట్టు చేయడానికి మహారాష్ట్ర పోలీసులు పక్కా స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌ విజయ్‌ ఓలేటి తయారు చేస్తున్న మెఫిడ్రిన్‌ గురించి తెలుసుకున్న ముంబైలోని డ్రగ్స్‌ ముఠా.. నమూనాను తీసుకురావాలంటూ బంగ్లాదేశీ మహిళ ఫాతిమా మురాబ్‌ షేక్‌ను హైదరాబాద్‌కు పంపారు. ఫాతిమా ఓ సాధారణ పర్యాటకురాలిగా హైదరాబాద్‌ వచ్చి, 200 గ్రాముల మెఫిడ్రిన్‌ను ముంబై తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు.. ఫాతిమాను అనుసరించారు. అక్కడి పోలీసుల సహకారంతో గత నెల 8న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 178 గ్రాముల మెఫిడ్రిన్‌ లభించింది. ఆ వెంట నే.. ఫాతిమాను హైదరాబాద్‌కు పంపిన డ్రగ్స్‌ ముఠాలోని 9 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాతే..డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి, చర్లపల్లిలోని డ్రగ్స్‌ తయారీ కంపెనీ గుట్టును రట్టు చేశారు. కాగా.. ఈ కేసుతో తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(ఈగల్‌), రాచకొండ పోలీసులు, ఎక్సైజు విభాగం, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం చర్లపల్లితోపాటు.. నాచారం పారిశ్రామిక వాడల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపినట్లు సమాచారం. శ్రీనివాస్‌ విజయ్‌ నిర్వహించిన నాచారంలోని వాగ్దేవి ల్యాబ్‌, చర్లపల్లిలోని కంపెనీని తనిఖీ చేసినట్లు తెలిసింది. కాగా, ఇటీవల అరెస్టయిన నైజీరియా డ్రగ్స్‌ సరఫరాదారుల కేసులో తెలం గాణ నార్కోటిక్స్‌ వింగ్‌ (ఈగల్‌) సోమవారం ముంబైలో తనిఖీలు జరిపిం ది. ముంబైతోపాటు..పుణెలో ఈగల్‌ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 09 , 2025 | 04:05 AM