Telangana Government: కొడంగల్‌లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:32 AM
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీస్థాయిలో బహుళార్థసాధక పరిశ్రమల పార్కును ఏర్పాటు....
850 ఎకరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు
విభిన్న రకాల పరిశ్రమలకు అవకాశం
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీస్థాయిలో బహుళార్థసాధక పరిశ్రమల పార్కును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల పరిధిలో దాదాపు 850 ఎకరాల్లో దీనిని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ) ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం వివిధ శాఖల నుంచి చట్టపరమైన అనుమతులు పొందే ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని అనుమతులు లభించిన తర్వాత గరిష్ఠంగా రెండేళ్లలో దీనిని పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వెనకబడిన జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పార్కులో రూ.200 కోట్లతో రహదారులు, నీటి సరఫరా, విద్యుత్ పంపిణీ వ్యవస్థలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. పరిశ్రమలకు అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రణాళిక రూపొందించినట్లు టీజీఐఐసీ అధికారులు వెల్లడించారు. ఫార్మాతో పాటు ఆటోమొబైల్, సిరామిక్స్, గ్లాస్, టెక్స్‌టైల్, ఫూడ్ ప్రాసెసింగ్, డైరీ, మెటల్ సర్ఫేస్ ట్రీట్‌మెంట్, స్టీల్ రోలింగ్ మిల్స్, గ్రాఫైట్ బ్లాక్స్ వంటి విభిన్న రకాల పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు.
పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా..
ఇప్పటివరకు వ్యవసాయంపైనే ప్రధానంగా ఆధారపడిన కొడంగల్ ప్రాంతంలో ఈ పారిశ్రామిక పార్కుతో ఉపాధి విప్లవాన్ని తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. స్థానిక యువత వలసలు పోకుండా వారికి ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.