ఆసక్తి ఉన్నవారినే బదిలీ చేయండి
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:46 AM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీడీవోలందరినీ గంపగుత్తగా తిరిగి పూర్వ జిల్లాలకు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ భావిస్తుండడంపై వారిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ప్రభుత్వానికి ఎంపీడీవోల వినతి
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీడీవోలందరినీ గంపగుత్తగా తిరిగి పూర్వ జిల్లాలకు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ భావిస్తుండడంపై వారిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలా కాకుండా తహసీల్దార్ల బదిలీల్లో అనుసరించిన మార్గదర్శకాలనే తమకూ వర్తింపజేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవా రినే బదిలీ చేయాలని కోరుతున్నారు. తహసీల్దార్ల బదిలీల్లో ఎవరైతే పూర్వ జిల్లాలకు వెళతామని కోరుకుంటారో వారి దగ్గర నుంచి సమ్మతి పత్రాలు తీసుకుని వారిని మాత్రమే బదిలీ చేశారు.
అంటే సమ్మతి పత్రం ఇవ్వని వారిని ప్రస్తుత స్థానం నుంచి కదల్చలేదు. తమకూ అదే నిబంధన వర్తింపజేయాలని ఎంపీడీవోలు విన్నవిస్తున్నారు. కాగా సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానికసంస్థల ఎన్నికల విషయమై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్నిబట్టి ఎంపీడీవోల బదిలీల ప్రక్రియ ముందుకు సాగుతుందని పంచాయతీరాజ్‌శాఖ వర్గాలు తెలిపాయి.