Minister Seethakka: తహసీల్దార్ల మాదిరిగానే బదిలీల్లో ఆప్షన్లు
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:54 AM
తహసీల్దార్ల తిరుగు బదిలీల్లో ఇచ్చినట్లే ఎంపీడీవోలకు బదిలీల్లో ఆప్షన్లు ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు.
ఎంపీడీవోల వినతిపై మంత్రి సీతక్క హామీ
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): తహసీల్దార్ల తిరుగు బదిలీల్లో ఇచ్చినట్లే ఎంపీడీవోలకు బదిలీల్లో ఆప్షన్లు ఇస్తామని మంత్రి సీతక్క తెలిపారు. తిరుగు బదిలీల్లో తమకు ఆప్షన్లు ఇవ్వాలని, 317 జీవోను వర్తింపజేయవద్దని కొందరు ఎంపీడీవోలు మంగళవారం సచివాలయంలో మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీడీవోలను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని, వారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా యథాస్థానాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 40 మంది ఎంపీడీవోలను గతంలో బదిలీ చేసిన సందర్భంలో 317 జీవో చూపకుండా దూర ప్రాంతాలకు పంపారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ జీవోను అడ్డు పెట్టుకుని వారిని బదిలీ చేయట్లేదని వివరించారు. వారి విజ్ఞప్తి మేరకు ఎంపీడీవోల బదిలీల్లో ఆప్షన్లు ఇస్తామని సీతక్క వారికి హామీ ఇచ్చారు.