Rajendra Prasad: ఎన్నికల విధుల్లో ఉండగా గుండెపోటు.. ఎంపీడీవో మృతి
ABN , Publish Date - Dec 19 , 2025 | 05:07 AM
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తిస్తుండగా ఎంపీడీవో రాజేంద్రప్రసాద్....
వెంకటాపురం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తిస్తుండగా ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ (61) గుండెపోటుతో మరణించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఆయన బుధవారం రాత్రి ఎంపీడీవో కార్యాలయం సమీపంలో కుప్పకూలిపోయారు. గమనించిన ఇతర ఉద్యోగులు ఆయన్ను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి ములుగు ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆపై, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. హనుమకొండకు చెందిన రాజేంద్రప్రసాద్.. వెంకటాపురం ఎంపీడీవోగా పని చేస్తున్నారు. మరో పది నెలల్లో పదవీ విరమణ పొందనుండగా ఈ లోపే మరణించారు.