MP Visweswar Reddy: వచ్చే మా ప్రభుత్వంలో నేనే రైల్వే మంత్రిని
ABN , Publish Date - Oct 15 , 2025 | 03:45 AM
కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, తమ ప్రభుత్వంలో తానే రైల్వేశాఖ మంత్రి అవుతానని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు...
వికారాబాద్ జిల్లా పార్టీ సారథి రాజశేఖర్‌రెడ్డి రాజకీయాలకు అనర్హుడు
ఆయనను నేనే ప్రతిపాదించా: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి
తాండూరు/తాండూరు రూరల్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, తమ ప్రభుత్వంలో తానే రైల్వేశాఖ మంత్రి అవుతానని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూపీఏ హయాం లో తెలంగాణలో రైల్వేస్టేషన్‌ల అభివృద్ధ్దిని పట్టించుకోలేదని, కొత్త రైళ్లు నడపడంలో ఈ ప్రాంతంపై చిన్న చూపు చూశారని ఆరోపించారు. తాము రాయలసీమ ఎక్స్‌ప్రె్‌సను బషీరాబాద్, నవాంద్గిలో నిలిపే విధంగా కృషి చేశామని తెలిపారు. హుబ్లీ రైలును తాండూరులో ఆపాలని రైల్వే జీఎంను కోరామని పేర్కొన్నారు. బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి రాజకీయాలకు అనర్హుడని, ఆయన స్థానికేతరుడని అన్నారు. తానే ఆయనను జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించానని, ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టినా పార్టీని నడపడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆయనను తొలగించే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోందని, ఆ విషయాన్ని అధిష్ఠానమే చూసుకుంటుందన్నారు.
చెట్టినాడ్ ఫ్యాక్టరీని మూసేయిస్తా
పైసలు సంపాదించేందుకు పేదల జీవితాలు నాశనం చేస్తారా.. సిగ్గుందా..? మీ ఫ్యాక్టరీ మూయిస్తా.. అంటూ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెట్టినాడ్ ఫ్యాక్టరీ ప్రతినిధులను హెచ్చరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో 135ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గ్రామ సమీపంలోని చెట్టినాడు బ్రిడ్జి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళనకు దిగిన తెలిసిందే. మంగళవారం ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సంగెంకలాన్ గ్రామాన్ని సందర్శించారు. చెట్టినాడు ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడారు. నష్టపోయిన గ్రామస్తులకు, రైతులకు పరిహారం ఫ్యాక్టరీ నుంచి ఇప్పించాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతోనూ ఆయన మాట్లాడారు.