Konda Vishweshwar Reddy: ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి గుండె శస్త్ర చికిత్స
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:10 AM
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయన హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే వాల్వ్ సన్నగా అవడంతో పాటు రక్తస్రావం...
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. ఫోన్‌లో మోదీ పరామర్శ
బంజారాహిల్స్/(రంగారెడ్డి జిల్లా ప్రతినిధి), నవంబరు 13(ఆంధ్రజ్యోతి): చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయన హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే వాల్వ్ సన్నగా అవడంతో పాటు రక్తస్రావం అవుతున్నట్టు ఇటీవల సాధారణ ఆరోగ్య పరీక్షలో తెలిసింది. దీంతో జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు ఏఆర్టిక్ వాల్వ్ రీప్లే్‌సమెంట్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నవంబరు 10న ఆపరేషన్ పూర్తి చేశారు. అప్పటి నుంచి విశ్వేశ్వర్ రెడ్డి ఆస్పత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. చిన్నతనం నుంచే గుండె కవాట సమస్యతో బాధపడుతున్న విశ్వేశ్వరెడ్డికి ఇటీవల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కాగా, కొండా విశ్వేశ్వరెడ్డిని ప్రధాని మోదీ గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఎంపీ క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని.. డాక్టర్ల సూచనలు తప్పక పాటించాలని చెప్పారు. మోదీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని విశ్వేశ్వరెడ్డి ‘ఎక్స్’లో వెల్లడించారు. అలాగే తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.