Share News

MP Konda Vishweshwar Reddy: జాతీయ రహదారిపై మలుపులు ఉంటే ప్రమాదకరం

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:21 AM

జాతీయ రహదారిపై మలుపులు ఉంటే ప్రమాదకరమని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌- చేవెళ్ల- బీజాపూర్‌ జాతీయ రహదారిపై...

MP Konda Vishweshwar Reddy: జాతీయ రహదారిపై మలుపులు ఉంటే ప్రమాదకరం

  • ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై మలుపులు ఉంటే ప్రమాదకరమని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌- చేవెళ్ల- బీజాపూర్‌ జాతీయ రహదారిపై అనేక చోట్ల మలుపులు ఉన్నాయని, వాటిని తొలగించి రహదారిని స్ర్టెయిట్‌గా (నేరుగా) నిర్మిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. ‘హైదరాబాద్‌- చేవెళ్ల- బీజాపూర్‌ జాతీయ రహదారి అలైన్‌మెంట్‌లో చాలాచోట్ల మలుపులు ఉన్నాయి. దేశంలో ఏ జాతీయ రహదారి అలైన్‌మెంట్‌ కూడా ఇలా లేదు. అందుకే అలైన్‌మెంట్‌ మార్చి మలుపులు ఉండకుండా నేరుగా ఉండేలా చేయాలి. అప్పుడు ప్రమాదాలకు ఆస్కారం ఉండదు’ అని అన్నారు. వంకరటింకరగా ఉన్న అలైన్‌మెంట్‌ను మారిస్తే భూసేకరణ ఎక్కువగా అవసరం ఉండదని, దూరం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. హైవేకు సంబంధించి సేకరించిన భూమి కూడా మిగులుతుందని, దానిని రైతులకు తిరిగి ఇవ్వవచ్చని తెలిపారు. హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారిపై మూడు ప్రాంతాల్లో డేంజర్‌ స్పాట్‌లు ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల తర్వాత, చేవెళ్ల ప్రాంత ఎమ్మెల్యేలను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వద్దకు తీసుకు వెళ్తానని తెలిపారు. ప్రస్తుతం మలుపులతో ఉన్న అలైన్‌మెంట్‌ను రద్దుచేసి, నేరుగా వేసే హైవే కోసం కొత్తగా భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.

Updated Date - Nov 06 , 2025 | 02:22 AM