Congress MP Deepender Hooda: ఉపాధిని ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:25 AM
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (మన్‌రేగా) ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దీంపేందర్ హుడా ఆరోపించారు....
ఎంపీ దీపేందర్ హుడా
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (మన్‌రేగా) ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దీంపేందర్ హుడా ఆరోపించారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 13 కోట్ల మంది పేదల పొట్ట కొట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్‌రేగా పథకానికి పూర్తిగా కేంద్రం నిధులే కేటాయిస్తే.. ఈ పథకం పేరును జీ రామ్‌జీగా మార్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలపై భారం మోపాలని చూస్తోందని విమర్శించారు. గాంధీ పేరుతో ఉన్న అన్ని పథకాల పేర్లనూ బీజేపీ ప్రభుత్వం మార్చేస్తోందన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీల పేర్లు చేర్చారని, చివరకు సత్యమే గెలిచిందని అన్నారు.
కేటీఆర్‌ను ఫుట్‌బాల్ ఆడుతున్నారు: చామల
కేటీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఫుట్‌బాల్ ఆడాల్సిన అవసరం లేదని, రాజకీయంగా ఇప్పటికే ఆయనను ఫుట్‌బాల్ ఆడుతున్నారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌లా తమ సీఎం అమెరికా నుంచి ప్యారాచూట్‌లో సిరిసిల్లకు రాలేదని, స్వతంత్రంగా జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ దుస్థితికి కిషన్‌రెడ్డే కారణమని ప్రధాని గుర్తించారని, అందుకే పిలిచి మరీ చీవాట్లు పెట్టారనిపేర్కొన్నారు. సోనియాకు లేఖలు రాసి మోదీని ప్రసన్నం చేసుకునేందుకు కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.