Chamala Kiran Kumar Reddy: ఎర్రకోటపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తావన సరికాదు
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:35 AM
ఎర్రకోటపై జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీజేపీ కార్యాలయంలో మాట్లాడుకోవాలి
వికసిత్ భారత్ సాధించాలనే ఉద్దేశం మోదీకి లేదు: ఎంపీ చామల
న్యూఢిల్లీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఎర్రకోటపై జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని ఆర్‌ఎ్‌సఎస్ గురించి మాట్లాడడం సరికాదని, బీజేపీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో ఈ విషయం మాట్లాడితే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అయితే, ఎర్రకోట వంటి జాతీయ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమని చామల అన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకల్లోనూ జాతీయ జెండా ఎగురవేయలేదని, దేశం, జాతీయ జెండా పట్ల గౌరవం లేని సంస్థ గురించి ఎర్రకోటపై మోదీ ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు.
ఇక సెమీ కండక్టర్ల విషయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని చామల విమర్శించారు. 1983లోనే చంఢీగఢ్‌లో ఒక సెమీ కండక్టర్ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభమైందని గుర్తు చేశారు. మోదీ గుజరాత్‌కు అందలం వేసుకుంటూ తెలంగాణపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ పెట్టాలన్న ప్రతిపాదనను కేంద్రం నిరాకరించిందని, ఏపీలో పెడితేనే అనుమతి ఇస్తామని ఒత్తిడి చేసిందని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిన్నరగా కేంద్ర మంత్రులకు ఎన్నో వినతులు సమర్పించినప్పటికీ, రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. మోదీకి వికసిత్ భారత్ సాధించాలనే ఉద్దేశం లేనందునే, తెలంగాణపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.