MP Chamal Kiran Kumar Reddy: గ్రూప్ 1పై కేటీఆర్ కుట్ర
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:44 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా గ్రూప్ 1 ఉద్యోగాలు రాకూడదని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు...
బీఆర్‌ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టండి: రియాజ్, చనగాని
హైదరాబాద్/ఢిల్లీ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా గ్రూప్-1 ఉద్యోగాలు రాకూడదని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వలేదని, గ్రూప్ పరీక్షలూ పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని, ఒక్కో అఽభ్యర్థి దగ్గర రూ.3కోట్లు తీసుకుని ఎంపిక చేశారని కేటీఆర్ ఆరోపణలపై ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరి తల్లిదండ్రులకైనా రూ. 3 కోట్లు పెట్టే స్తోమత ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వంపై కేటీఆర్ నిందలు వేస్తున్నారన్నారు. గ్రూప్ -1 పరీక్షపై బీఆర్‌ఎస్ విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఎంపికైన అభ్యర్థులు, కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో మీడియాతో వారు మాట్లాడుతూ.. నిరుద్యోగుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, వారి న్యాయబద్ధమైన పోరాటాలను గౌరవిస్తుందని అన్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు.