Share News

Domestic Issues: ఇలాంటి వాడిని ఎందుకు కన్నావ్‌!?

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:48 AM

పెళ్లయిన ఏడాదికే కవలలు పుట్టారు. ఒకే సారి అమ్మాయి, అబ్బాయి పుట్టడంతో ఆ దంపతులు మురిసిపోయారు. కానీ, ఆ కవలల్లోని అబ్బాయికి...

Domestic Issues: ఇలాంటి వాడిని ఎందుకు కన్నావ్‌!?

  • భర్త వేధింపులు తాళలేక పిల్లలను చంపి, భవనంపై నుంచి దూకిన తల్లి

  • కవల పిల్లల్లో ఒకరికి రాని మాటలు

  • లోపం నీవల్లే అంటూ భర్త వేధింపులు

  • వేదనతో తీవ్ర నిర్ణయం తీసుకున్న భార్య

  • హైదరాబాద్‌ బాలానగర్‌లో ఘటన

బాలానగర్‌, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): పెళ్లయిన ఏడాదికే కవలలు పుట్టారు. ఒకే సారి అమ్మాయి, అబ్బాయి పుట్టడంతో ఆ దంపతులు మురిసిపోయారు. కానీ, ఆ కవలల్లోని అబ్బాయికి రెండేళ్లయినా మాటలు సరిగా రాకపోవడం ఆ దంపతుల మధ్య చిచ్చు రేపింది. పిల్లాడిలోని లోపానికి.. నువ్వే కారణం, పిల్లల్ని కనేది ఇలాగేనా, ఇలాంటి వాడిని ఎందుకు కన్నావ్‌.. అంటూ భర్త నుంచి ఎదురైన వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. రెండేళ్లు వయస్సున్న తన కన్నబిడ్డలిద్దరి ప్రాణం తీసి.. ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లో మంగళవారం వెలుగు చూసిన ఈ హృదయ విదారక ఘటనలో సాయులక్ష్మి అనే వివాహిత, ఆమె పిల్లలు చేతన్‌ కార్తికేయ, లాస్యతవల్లి మరణించారు. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు, సాయిలక్ష్మి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని నూజివీడుకు చెందిన అనిల్‌ కుమార్‌కు గుంటూరు జిల్లా చెరుపల్లికి చెందిన చల్లారి సాయులక్ష్మికి 2022 ఆగస్టు 8న వివాహమైంది. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి అయిన అనిల్‌ కుమార్‌.. వివాహ అనంతరం బాలానగర్‌ పరిధి పద్మానగర్‌ ఫేజ్‌-1లోని ఓ అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో కాపురం పెట్టాడు. అనిల్‌, సాయిలక్ష్మి దంపతులకు 2023 అక్టోబరులో ఇద్దరు కవలలు జన్మించారు. వారిలో కుమార్తె లాస్యత వల్లి చక్కగా మాట్లాడుతుండగా, కుమారుడు చేతన్‌ కార్తికేయకు రెండేళ్లయిన మాటలు రావడం లేదు. దాంతో చేతన్‌కు స్పీచ్‌ థెరపీ ద్వారా శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు. అయితే, కుమారుడిలో ఉన్న లోపం విషయంలో అనిల్‌ తరచూ సాయిలక్ష్మిని సూటిపోటి మాటలతో వేధించేవాడు. ఇలాంటి అబ్బాయిని ఎందుకు కన్నావ్‌..? కుటుంబంలో పరువు పోతోంది అంటూ బాధపెట్టేవాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతుండేది. ఇదేక్రమంలో వైజాగ్‌లోని బంధువుల ఇంట్లో మంగళవారం జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అంశంలో సోమవారం రాత్రి కూడా గొడవ జరిగింది. భార్య, పిల్లలన్ని తీసుకెళ్తే అక్కడ తన పరువు పోతుందుని, అందుకే ఒక్కడినే వెళ్తానని అనిల్‌ తేల్చిచెప్పాడు.


భార్యాబిడ్డలను ఇంట్లోనే వదిలేసి మియాపూర్‌లో ఉంటున్న సోదరుడితో కలిసి వైజాగ్‌ వెళ్లేందుకు రాత్రి 10 గంటల సమయంలో అనిల్‌ వెళ్లిపోయాడు. ఈ వివాదంతో తీవ్ర మనోవేదనకు గురైన సాయిలక్ష్మి.. గొంతునులిమి తన పిల్లల ప్రాణం తీసింది. అనంతరం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నివాసముంటున్న భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకింది. రోడ్డు మీద కొన ఊపిరితో కొట్టుకుంటున్న సాయిలక్ష్మిని చూసి అటుగా వెళుతున్న ఓ ర్యాపిడో డ్రైవర్‌ స్థానికులను అప్రమత్తం చేశాడు. ఈ లోపే ఆమె ప్రాణం విడిచింది. స్థానికులు పోలీసులకు, సాయిలక్ష్మి భర్త అనిల్‌కు సమాచారం ఇచ్చారు. సాయిలక్ష్మి తండ్రి మారయ్యబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనిల్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.

Updated Date - Oct 15 , 2025 | 04:48 AM