Share News

Domestic Tragedy: ఏడేళ్ల బిడ్డను భవనంపై నుంచి తోసేసిన తల్లి

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:58 AM

మల్కాజిగిరిలో దారుణ ఘటన జరిగింది. ఏడేళ్ల కూతురును కన్నతల్లే మూడో అంతస్తు నుంచి కిందకు జారవిడిచి చంపేసింది.....

Domestic Tragedy: ఏడేళ్ల బిడ్డను భవనంపై నుంచి తోసేసిన తల్లి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి

తల్లి మానసిక స్థితి బాగోలేకనే ..

కుమార్తెను దేవుడి దగ్గరకు పంపుతున్నా

ఈ బిడ్డపోతే మరో బిడ్డ పుడుతుంది అంటూ ఆమె వ్యాఖ్యలు!?

మల్కాజిగిరి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరిలో దారుణ ఘటన జరిగింది. ఏడేళ్ల కూతురును కన్నతల్లే మూడో అంతస్తు నుంచి కిందకు జారవిడిచి చంపేసింది. మానసిక పరిస్థితి బాగోలేకే ఆమె ఈ ఘటనకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన రెడపాక మోనాలిసా (37), డేవిడ్‌ భార్యాభర్తలు. వీరికి కుమార్తె షరోన్‌ మేరీ (7), కుమారుడు ఉన్నారు. మేరీ, ఓ ప్రైవేటు స్కూల్‌లో మూడో తరగతి చదువుతోంది. డేవిడ్‌ ప్రైవేటు ఉద్యోగి. మోనాలిసా పోచారం ఐటీ కారిడార్‌ పరిధిలోని సేవాభారతి అనే క్రిస్టియన్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. మోనాలిసా ఆదివారం రాత్రంతా నిద్రపోలేదు. పైగా ఏదేదో అరించింది. భార్య పరిస్థితిని చూసి మర్నాడు డేవిడ్‌ ఉద్యోగానికి వెళ్లలేదు. పిల్లలూ స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రించిన మోనాలిసా, మధ్యాహ్నం నిద్రలేచింది. ఆ వెంటనే కుమార్తె మేరీని ఎత్తుకొని ఇంట్లోంచి బయటకు వెళుతుండగా ఎక్కడికి పోతున్నావు? అంటూ ఆమెను భర్త ప్రశ్నించారు. ఎక్కడికీ లేదంటూనే ఆమె, నేరుగా బాలికను ఎత్తుకొని మూడో అంతస్తుకు వెళ్లి, అక్కడి నుంచి చిన్నారిని కిందకు జారవిడిచింది. ఈ ఘటనలో మేరీకి తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మోనాలిసాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అంతకుముందు తన కూతురును దేవుడి వద్దకు పంపుతున్నానని, ఈ కూతురు పోతే మరో కూతురు పుడుతుంది అని కుటుంబసభ్యులతో మోనాలిసా అన్నట్లుగా స్థానికులు చెప్పారు.

Updated Date - Dec 17 , 2025 | 04:58 AM