Mother of Jubilee Hills MLA Gopinath Files: గోపీనాథ్ మృతిపై దర్యాప్తు చేయండి
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:26 AM
తన కుమారుడి మృతిపై దర్యాప్తు చేయాలని.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి (92) శనివారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు...
రాయదుర్గం పీఎ్‌సలో ఆయన తల్లి ఫిర్యాదు
రాయదుర్గం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): తన కుమారుడి మృతిపై దర్యాప్తు చేయాలని.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి మహానందకుమారి (92) శనివారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మృతికి కారణాలపైన, ఆయన పట్ల జాగ్త్రలు తీసుకోవాల్సిన వాళ్ల నిర్లక్ష్యంపైన విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన కొడుకు మృతి వెనక.. నిర్లక్ష్యం, సరిగ్గా చూసుకోకపోవడంతోపాటు మరింకేదో ఉన్నట్లు అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోపీనాథ్ అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో ఈ ఏడాది జూన్ 5న చేరారని.. జూన్ 6న తాను ఆస్పత్రికి వెళ్తే తన కుమారుణ్ని చూడ్డానికి సెక్యూరిటీ సిబ్బంది తనను అనుమతించలేదని, గోపీనాథ్ కుమార్తె దిశిర రాతపూర్వకంగా వారికి ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణమని ఆమె వాపోయారు. జూన్ 8న గోపినాథ్ చనిపోయినట్లు ఆస్పత్రి ప్రకటించిందని.. అంతకు ముందే గోపినాథ్ చనిపోయినప్పటికీ, ఆస్పత్రివర్గాలు ఆలస్యంగా ప్రకటించినట్లు తెలుస్తోందని ఫిర్యాదులో ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.