Mother Appeals for Help to Save Daughter: నా కూతురి ప్రాణాలు కాపాడండి
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:23 AM
ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ ప్రమాదంలో భర్త చనిపోగా.. ఉన్న ఒక్కగానొక్క కూతురు తీవ్రమైన అనారోగ్య...
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద విద్యార్థిని
వైద్య సాయం చేసి ఆదుకోవాలని దాతలకు తల్లి వేడుకోలు
బోనకల్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఓ ప్రమాదంలో భర్త చనిపోగా.. ఉన్న ఒక్కగానొక్క కూతురు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో మంచానికే పరిమితమయింది. కూలీ పనులు చేసే ఆ తల్లి తన కుమార్తె వైద్యం కోసం ఇప్పటికే శక్తికి మించిన అప్పులు చేసింది. అయునా కూతురి ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో దాతల సాయం కోసం అర్థిస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మాణపల్లి గ్రామానికి చెందిన తాటికొండ లాజరు, మరియమ్మ దంపతులకు అపర్ణ ఒక్కగానొక్క కుమార్తె. 2019లో మధిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా తనకు లివర్ సంబంధిత వ్యాధితో పాటు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తేలింది. అప్పటినుంచి తప్పని పరిస్థితుల్లో చదువుకు స్వస్తి చెప్పి ఇంటికే పరిమితమైంది. కూతురి వైద్యం కోసం తల్లిదండ్రులు తమ శక్తికి మించి అప్పులు చేశారు. అలాంటి కష్ట సమయాల్లో ఆరు నెలల క్రితం కుటుంబ పెద్ద అయిన అపర్ణ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తల్లి ఒకవైపు కూలీ పనులకు వెళ్తూనే.. మరోవైపు అనారోగ్యంతో ఉన్న కూతురిని చూసుకుంటోంది. కానీ సరైన చికిత్స అందకపోవడంతో అపర్ణ లివర్ పూర్తిగా దెబ్బతిన్నది. దాంతోపాటు ఇతర అవయవాలు కూడా సరిగా పని చేయడం లేదని వైద్యులు తెలిపారు. దీంతో నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు వైద్యం చేయించారు. అయినా ఆరోగ్యం మెరుగు కాకపోవడం, ఆరోగ్యశ్రీ పరిమితి కూడా దాటడంతో ఇప్పుడు పూర్తిగా డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. అపర్ణకు లివర్‌తో పాటు మరో మూడు సర్జరీలు చేయాల్సి ఉంటుందని, అందుకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు. చేసిన అప్పులు తీర్చలేక దయనీయ పరిస్థితిలో ఉన్న మరియమ్మ తమ కూతురిని బతికించాలని, వైద్యం చేయించి మానవత్వం చాటుకోవాలని దాతలను వేడుకుంటోంది.