Share News

Mother and Lover Arrested: ఏడుస్తుందని చంపేశాం

ABN , Publish Date - Sep 14 , 2025 | 04:57 AM

కన్నబిడ్డను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటనలో తల్లి మమత, ఆమె ప్రియుడు షేక్‌ ఫయాజ్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు..

Mother and Lover Arrested: ఏడుస్తుందని చంపేశాం

  • వివాహేతర సంబంధానికి అడ్డం అన్న ఆలోచనతోప్రియుడితో కలిసి రెండేళ్ల కూతురును చంపిన తల్లి

  • చిన్నారిని కొట్టి.. గొంతు నులిమి దారుణ హత్య

తూప్రాన్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కన్నబిడ్డను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటనలో తల్లి మమత, ఆమె ప్రియుడు షేక్‌ ఫయాజ్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తూప్రాన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ కేసు వివరాలను వెల్లడించారు. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శభా్‌షపల్లికి చెందిన మమత(23) వివా హం సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం వడ్డెపల్లికి చెందిన బంటు భాస్కర్‌తో జరిగింది. వీరికి చరణ్‌(4), తనూశ్రీ(2) సంతానం. పెళ్లికి ముందు నుంచే మమతకు గ్రామానికి చెందిన షేక్‌ ఫయాజ్‌(30)తో వివాహేతర సంబంధం ఉంది. మరోవైపు, భర్త భాస్కర్‌ అమాయకత్వం మమతకు నచ్చలేదు. దీంతో ఆమె కొంతకాలం క్రితం ప్రియుడు ఫయాజ్‌తో పరారైంది. కొద్దిరోజులకు తిరిగి వచ్చినా భర్తతో కలిసి ఉండేందుకు ఇష్టం లేక మేలో తల్లిగారింటికి పిల్లలతో వెళ్లిపోయిం ది. మే 21న కొడుకు చరణ్‌ను తల్లిగారింటి వద్దనే వదిలి తనుశ్రీని తీసుకొని అత్తగారింటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన మమత ఫయాజ్‌తో మళ్లీ పరారైంది. అయితే, మమత ఇంటికి రాలేదని అల్లుడు భాస్కర్‌ చెప్పడంతో 27న మమత తండ్రి రాజు శివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


జ్వరంతో చనిపోయుందని అబద్ధాలు

ఏపీలోని గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కనపర్రు వద్ద మమత, షేక్‌ ఫయాజ్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని శుక్రవారం శివ్వంపేట తీసుకొచ్చారు. తనుశ్రీ ఎక్కడని అడగగా, జర్వంతో చనిపోయిందని ఇద్దరు రకరకాలుగా చెప్పడంతో లోతుగా ప్రశ్నించారు. దీంతో, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, ఏడుస్తూ ఇబ్బంది పెడుతోందని, అందుకే చంపేశామని వారు ఒప్పుకొన్నారు. కనపర్రుకు పరారైన వీరు మే 28న చిన్నారి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. తర్వాత జూన్‌ 4న బైక్‌పై శభా్‌షపల్లికి తీసుకువచ్చారు. శభా్‌షపల్లిలోనే తనుశ్రీని కొట్టి, గొంతు నులిమి హతమార్చి పూడ్చి పెట్టారు. అదే రాత్రి తిరిగి వెళ్తూ బైక్‌లను చోరీ చేస్తూ పెట్రోల్‌ ఉన్నంత వరకు వెళ్తూ.. ఇలా నాలుగు బైక్‌లు మార్చేసి కనపర్రుకు వెళ్లిపోయారు. మిస్సింగ్‌ కేసులో వీరిని అరెస్ట్‌ చేయగా, కన్నబిడ్డను ప్రియుడితో కలిసి చంపేసిన విషయం బయటకు వచ్చింది. శుక్రవారం వారిద్దరు చూపించిన ప్రాంతంలో తవ్వి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. శనివారం బంటు మమత, ప్రియుడు షేక్‌ ఫయాజ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫయాజ్‌పై 20 కేసులు ఉన్నాయని, శివ్వంపేట పోలీసు స్టేషన్‌లో రౌడీ షీట్‌ ఉందని డీఎస్పీ నరేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 04:57 AM