Child Trafficking: అమ్మా.. చెల్లెను అమ్మొద్దమ్మా..
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:03 AM
కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే డబ్బుకు ఆశపడి అమ్మేశారు! ‘అమ్మా చెల్లెను విక్రయించొద్దమ్మా’ అంటూ పెద్ద కూతురు ఏడుస్తూ వేడుకున్నా కరగలేదా...
రూ.3 లక్షలకు కన్నబిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు.. అమ్మొద్దంటూ ఏడుస్తూ వారిని వేడుకున్న పెద్దకుమార్తె
నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఘటన
గతంలోనూ ఒక శిశువును విక్రయించినట్లు ఆరోపణ
వారిపై కేసు నమోదు చేసిన ఐసీడీఎస్ అధికారులు
తిరుమలగిరి (సాగర్), అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కడుపున పుట్టిన ఆడపిల్లను కన్నవారే డబ్బుకు ఆశపడి అమ్మేశారు! ‘అమ్మా చెల్లెను విక్రయించొద్దమ్మా’ అంటూ పెద్ద కూతురు ఏడుస్తూ వేడుకున్నా కరగలేదా కర్కశ హృదయాలు!! నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఎల్లాపురంతండాకు చెందిన కొర్ర బాబుకు పెద్దవూర మండలం ఊరబావితండాకు చెందిన పార్వతికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులు జీవనోపాధి నిమిత్తం నల్లగొండకు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పార్వతికి మొదటి కాన్పులో కుమారుడు జన్మించి అనారోగ్యంతో వెంటనే చనిపోయాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు జన్మించటంతో నల్లగొండలోనే ఉంటూ చిన్నారులను చదివించుకుంటున్నారు. ఆ చిన్నారుల్లో ఒకరి వయసు ఆరేళ్లు కాగా.. మరొకరికి ఏడేళ్లు. ఇదిలా ఉండగా.. ఈ నెల 10వ తేదీన పార్వతి నల్లగొండ జిల్లా హాలియాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడ శిశువును ప్రసవించింది. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. మళ్లీ పాప పుట్టడంతో పోషణ భారంగా భావించి, ఆ శిశువును విక్రయించాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. పార్వతి తల్లిదండ్రుల సహకారంతో.. మధ్యవర్తుల ద్వారా ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన దంపతులకు రూ.3లక్షలకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఈ తతంగమంతా ఫోన్ సంభాషణల ద్వారానే సాగడంతో.. చెల్లిని అమ్మేస్తున్న విషయం పెద్ద పిల్లలిద్దరికీ అర్థమైంది. దీంతో బాబు, పార్వతిల పెద్ద కుమార్తె నక్షత్ర ఈ విషయాన్ని నాయనమ్మకు తెలియజేసి, శిశువును విక్రయించకుండా అడ్డుకోవాలని కోరింది.
కనికరమైనా లేక..
విక్రయానికి ఏర్పాట్లు పూర్తి కావడంతో.. శిశువును తీసుకుని తల్లి పార్వతి తన పుట్టింటికి వెళ్లే సమయంలో పెద్ద కుమార్తె నక్షత్ర అడ్డుకుని చెల్లిని విక్రయించవద్దని భోరున విలపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మనవరాలిని అమ్మొద్దని బాబు తల్లి కూడా వేడుకుంది. పెద్ద బిడ్డ ప్రాధేయపడ్డా, తల్లి వేడుకున్నా.. బాబు హృదయం కరగలేదు. ఆయన తన భార్య పార్వతి, నవజాత శిశువుతో కలిసి ఈ నెల 23న తన అత్తవారి ఊరైన ఊరబాయితండాకు చేరుకున్నారు. దీంతో.. బాబు తల్లి తన పెద్ద కుమారుడు సురేశ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. సురేశ్ తన తమ్ముడు బాబుకు ఫోన్ చేసేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. పాపను తానైనా పెంచుకుంటానని చెప్పినా, డబ్బులకు ఆశపడి ఇతరులకు అమ్ముతున్నారని పేర్కొంటూ సురేశ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందడంతో విషయం బయటకు పొక్కింది.
కేసు నమోదు
శిశువును తీసుకుని ఈ నెల 23న ఊరబాయితండాకు వెళ్లిన పార్వతి, బాబు దంపతులు ఆ రాత్రికి అక్కడే ఉన్నారు. భార్యను, పాపను అక్కడే వదిలి బాబు తిరిగి నల్లగొండకు వచ్చాడు. శిశువును కొనుగోలు చేసిన దంపతుల నుంచి డబ్బు అందిన తర్వాత, 25వ తేదీ ఉదయం నాగార్జునసాగర్ సమీపంలోని సమ్మక్క, సారక్క దేవాలయం వద్ద.. పార్వతి తమ పాపని ఆ దంపతులకు అప్పగించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, నల్లగొండ జిల్లా ఐసీడీఎస్ అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. బాబు పరారీలో ఉండడంతో, అతని సోదరుడు సురేశ్‌తో మాట్లాడి, శిశువును విక్రయించిన విషయాన్ని నిర్ధారించుకుని కేసు నమోదు చేశారు. కాగా.. బాబు, పార్వతి దంపతులు శిశువును విక్రయించడం ఇదే మొదటిసారి కాదని.. మూడో కాన్పులో జన్మించిన కుమార్తెను సైతం విక్రయించారని తండావాసులు ఆరోపిస్తున్నారు.