Share News

Mother Accused: ఇద్దరు పిల్లలను చంపింది కన్నతల్లే!

ABN , Publish Date - Sep 27 , 2025 | 03:12 AM

పిల్లలకు చిన్నదెబ్బ తగిలితేనే తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది. అలాంటిది కన్న తల్లే కర్కశంగా పిల్లలను చంపేసింది. అదేమీ తెలియనట్టు నటించింది...

Mother Accused: ఇద్దరు పిల్లలను చంపింది కన్నతల్లే!

  • 9 నెలల క్రితం చిన్న కుమారుడిని సంపులో వేసి.. ఇప్పుడు పెద్ద కుమారుడి మెడకు తాడు బిగించి హత్య

  • మహబూబాబాద్‌ జిల్లా నారాయణపురంలో చిన్నారుల హత్యాయత్నం, హత్యకేసుల్లో వీడిన మిస్టరీ

కేసముద్రం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు చిన్నదెబ్బ తగిలితేనే తల్లి ప్రాణం విలవిల్లాడుతుంది. అలాంటిది కన్న తల్లే కర్కశంగా పిల్లలను చంపేసింది. అదేమీ తెలియనట్టు నటించింది. కానీ చివరికి విషయం బయటపడి కటకటాల పాలైంది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో గురువారం జరిగిన మునీశ్‌కుమార్‌ (5) హత్య మిస్టరీ వీడింది. ఈ బాలుడినే కాదు తొమ్మిది నెలల క్రితం తన మరో కుమారుడిని కూడా కన్నతల్లి శిరీషనే హత్య చేసినట్టు బయటపడింది. శుక్రవారం మహబూబాబాద్‌ రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన శిరీష, నారాయణపురానికి చెందిన పందుల ఉపేందర్‌ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమారులు మనీశ్‌కుమార్‌ (5), మోక్షిత్‌, నిహాల్‌ (చనిపోయేనాటికి- ఏడాదిన్నర) ఉన్నారు. ఉపేందర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలం నుంచి వారి దాంపత్యంలో పొరపొచ్చాలు వచ్చాయి. ఉపేందర్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనను పట్టించుకోవడం లేదని, పిల్లలను తన వద్దకు రానీయకుండా అత్తామామల వద్దే ఉంచుతున్నాడని శిరీష భావించింది. ఆ ఆందోళనతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాను చనిపోతే పిల్లలు ఆగమైపోతారని, ముందుగా వారిని చంపాలని అనుకుంది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో చిన్న కుమారుడు నిహాల్‌ను ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేసి బయటికి వెళ్లింది. కానీ నానమ్మ మంగమ్మ గమనించి బయటికి తీసింది. కానీ శిరీష అదే నెల 15న నిహాల్‌ను మరోసారి నీటి సంపులో పడేయగా ప్రాణాలు కోల్పోయాడు. అది ప్రమాదవశాత్తు జరిగిందని అంతా భావించారు. ఇక జూలై 30న రాత్రి పెద్ద కుమారుడు మనీశ్‌కుమార్‌ మెడపై కత్తితో దాడి చేసింది. ఏమీ తెలియనట్టుగా ఉండిపోయింది. కానీ మనీశ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్లీ ఈ నెల 24న (బుధవారం) రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనీశ్‌ మెడకు నైలాన్‌ తాడు బిగించి చంపేసి.. ఏమీ తెలియనట్టు ఉండిపోయింది. అయితే పోలీసులు అనుమానంతో శిరీషను విచారించగా.. ఇద్దరు పిల్లలను తానే హతమార్చినట్టు అంగీకరించింది. దీనితో పోలీసులు గ్రామంలో తొమ్మిది నెలల క్రితం పూడ్చిపెట్టిన నిహాల్‌ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పిల్లల నానమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శిరీషను అరెస్ట్‌ చేశారు. కాగా, పిల్లల విషయంలో శిరీష ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవహరించిందని, ఏమీ తెలియనట్టు నటించిందని తండ్రి ఉపేందర్‌ వాపోయారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా పిల్లలను కాపాడుకునేవాడినంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Updated Date - Sep 27 , 2025 | 03:12 AM