Share News

Telangana State Election Commission: వేలం, బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:37 AM

రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన...

Telangana State Election Commission: వేలం, బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు

  • అభ్యంతరాలు, ఫిర్యాదులు వాస్తవమైతే రద్దే.. పర్యవేక్షక కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదం

  • అభ్యర్థుల నుంచి అఫిడవిట్‌ తీసుకోవాలి

  • ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ మార్గదర్శకాలు

  • పంచాయతీ నామినేషన్లు షురూ

  • సర్పంచులకు 3242, వార్డులకు 1821 నామినేషన్లు

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దృష్టి సారించింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు, బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏకగ్రీవాలకు సంబంధించిన విధివిధానాలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలకు సూచనలు చేస్తూ ఎస్‌ఈసీ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ (ఎన్నికల నిర్వహణ) చట్టం-2018లోని 15వ నిబంధన ప్రకారం.. ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి.. ఒక్కరే పోటీలో ఉండడం, అవతలి వ్యక్తిని భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు, రిటర్నింగ్‌ అధికారి నిబంధనలు పాటించారా? లేదా? అన్నదానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. ఏకగ్రీవాల ప్రకటన కోసం జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాలను నియమించాలన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్‌ 211 ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపారు. ఫిర్యాదులు లిఖితపూర్వకంగా, వాట్సాప్‌ ద్వారా, మౌఖికంగా లేదంటే వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల రూపంలో కూడా ఉండొచ్చని పేర్కొన్నారు.


అభ్యర్థుల నుంచి డిక్లరేషన్‌

సర్పంచ్‌, వార్డు స్థానానికి ఏకగ్రీవమైతే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేసమయంలో పోటీలో ఉన్న ఒకేఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బు ఎర చూపలేదని, వేలంపాటలో పాల్గొనడం, బెదిరింపులకు పాల్పడడం వంటివి చేయలేదని ధ్రువీకరించే పత్రాన్ని తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణకు వస్తే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్‌ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలి. ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్‌ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించి, వాటిపై ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాన్ని ఆమోదించాలి. అదే సమయంలో ఈ ఫలితం సమాచారంతో ఓ నివేదికను రూపొందించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొన్నారు. గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు గుర్తిస్తే.. ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

పంచాయతీ నామినేషన్లు షురూ

పంచాయతీ ఎన్నికలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలివిడత ఎన్నికలు జరిగే 189 మండలాల్లో 4,236 సర్పంచ్‌, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. తొలిరోజు సర్పంచ్‌ స్థానాలకు 3242 మంది, వార్డు సభ్యులకు 1821 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించి, అదేరోజు సాయంత్రం చెల్లుబాటయ్యే నామినేషన్ల జాబితాను వెల్లడిస్తారు. వాటిపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబరు 1న అప్పీలు చేసుకుంటే 2న పునఃపరిశీలన చేస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.

బ్యాంకు ఖాతాల్లేక వెనక్కి..?

తొలివిడత ఎన్నికల్లో భాగంగా సర్పంచ్‌, వార్డుసభ్యుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్‌ దాఖలు చేయదలచిన అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని నిర్ధారించే విధంగా తాజగా బ్యాంకు ఖాతాను తెరవాలన్నది ఎస్‌ఈసీ నిబంధన. అయితే నూతన బ్యాంక్‌ ఖాతా ఉండాలని అధికారులు సూచించడంతో చాలామంది నామినేషన్లు దాఖలు చేయకుండానే వెనక్కి వెళ్లారు. ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతా ఉన్నవారు కొత్తగా ఖాతా తెరిచేందుకు మరో బ్యాంకును సంప్రదిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Nov 28 , 2025 | 04:37 AM