Share News

Election Violations: అటు పంపిణీ.. ఇటు వసూలు

ABN , Publish Date - Dec 14 , 2025 | 07:11 AM

రాష్ట్రంలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణం వరకు అన్నిరకాలుగా ప్రయత్నించారు.

Election Violations: అటు పంపిణీ.. ఇటు వసూలు

  • రెండో విడత పోలింగ్‌ కోసం పల్లెల్లో భారీగా డబ్బుల పంపిణీ.. రంగారెడ్డి జిల్లాలో ఓటుకు రూ.10-15 వేలు

  • ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో

  • రూ.7 వేల చొప్పున తాయిలం

  • నల్లగొండ జిల్లాలో జోరుగా డబ్బు, మద్యం, మటన్‌ పంపిణీ

  • పంచిన డబ్బు తిరిగి వసూలు చేస్తున్న మొదటి విడతలో ఓడిన అభ్యర్థులు

  • నాకు ఓటేశారా? అని ఓ గ్రామంలో

  • ఓటర్లతో ఒట్టు వేయించుకున్న అభ్యర్థి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణం వరకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు ఆదివారం పోలింగ్‌ జరుగనుండగా, శనివారం రాత్రి గ్రామాల్లో డబ్బు, మద్యం ఏరులై పారింది. అభ్యర్థులు పోటీపడి ఓటు రేటు పెంచేశారు. మరోవైపు మొదటి విడుతలో కొన్ని గ్రామాల్లో ఓడిపోయిన అభ్యర్థులు.. తాము పంచిన డబ్బును ఓటర్ల నుంచి వసూలు చేయటం చర్చనీయాంశమైంది.


ఓటుకురూ.15,000

రెండోవిడుత పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని పలు మేజర్‌ గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు సగటున రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. చేవెళ్ల డివిజన్‌లోని చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, షాబాద్‌ మండలాల్లో ఓటుకు తక్కువలో తక్కువ రూ.3,000 నుంచి అత్యధికంగా రూ.15 వేల వరకు పంపిణీ చేశారు. జనరల్‌, బీసీ జనరల్‌ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నచోట అభ్యర్థులు డబ్బుకు వెనుకాడకుండా ఖర్చు చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఓ పంచాయతీలో ఓటుకు రూ.7 వేల వరకు పంచారని తెలిసింది. కూసుమంచి మండలంలోని ఓ గ్రామంలోనూ ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు. చాలా గ్రామాల్లో ఓటుకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు నగదుతోపాటు మద్యం, మాంసం, చీరలు, పలు రకాల బహుమతులు కూడా పంచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓట్ల సంఖ్యను బట్టి గ్రామాల్లో ఒక్కో సర్పంచ్‌ అభ్యర్థి రూ.50-60 లక్షల వరకు ఖర్చుచేశారు. శనివారం రాత్రి ఓటుకు రూ.1,000-2,000 వరకు పంపిణీ చేశారు. నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ఓటుకు రూ.2 వేల నగదు, క్వార్టర్‌ మద్యం బాటిల్‌ పంపిణీ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓటుకు రూ.1,000తోపాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు.


నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వెండి ఉంగరాలు

నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు శనివారం రాత్రి ఇంటింటికి తిరిగి ఓటర్లకు బొట్టు పెట్టి.. రూ.1,000 నగదు, మద్యం, చికెన్‌తో కూడిన కవర్‌ను చేతిలో పెట్టి ఓటు అడిగారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉంగరం గుర్తు వచ్చిన అభ్యర్థులు ఓటర్లకు వెండి ఉంగరాలు పంచారు. కరీంనగర్‌. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనూ సర్పంచ్‌ అభ్యర్థులు ఓటుకు రూ.2,000 వరకు పంపిణీ చేశారు. నిర్మల్‌ జిల్లా జౌల(కే) గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థి బోయిన్వాడ్‌ వినోద్‌కు స్వగ్రామంలో ఇల్లు లేకపోవటంతో ఎన్నికల ప్రచారం సమయంలో బస చేసేందుకు తాత్కాలికంగా రూ.6 లక్షలతో కంటైనర్‌ ఇంటిని నిర్మించుకున్నాడు.


ఓటుకు రూ.10 వేలు, ఫుల్‌ బాటిల్‌

నల్లగొండ జిల్లాలో కూడా అభ్యర్థులు పోటాపోటీగా నగదు, మద్యం, మాంసం పంపిణీ చేశారు. తిరుమలగిరిసాగర్‌ మండలంలోని ఒక గిరిజన తండా పంచాయతీలో ఓటుకు రూ.4 వేల నగదు, ఇంటికి కిలో మటన్‌, ఫుల్‌ బాటిల్‌ మద్యం పంచారు. నిడమనూరు, అనుముల మండలాల్లో ఓటుకు రూ.3 వేల నగదు, క్వార్టర్‌ మద్యం, ఇంటికి కిలో చికెన్‌ పంపిణీ చేశారు. ఐదు గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా మిక్సీలు, ఫ్యాన్లు పంచారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలో పోటీలో ఉన్న నలుగురు సర్పంచ్‌ అభ్యర్థులు ఒక్కొక్కరు ఓటుకు రూ.10వేల వరకు పంపిణీ చేశారని సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శనివారం రాత్రి అభ్యర్థులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి రూ.1,500 నగదు, ఇంటికి ఫుల్‌ బాటిల్‌ మద్యం, కేజీ చొప్పున మటన్‌, చికెన్‌ అందించారు. కొందరు చీరలు, మిక్సీలు కూడా పంపిణీ చేసినట్లు తెలిసింది.


ఫ్లయింగ్‌ స్క్వాడ్‌పై దాడి

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బందిపై దాడి జరిగింది. మన్నెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కాల్యతండాలో ఉన్న ఓ కిరాణాషాపులో మద్యం నిల్వ చేశారని వచ్చిన సమాచారంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీ చేయటానికి వెళ్లారు. దీంతో కొండపల్లి రమే్‌షరెడ్డి అనే వ్యక్తి సిబ్బందిని దూషిస్తూ దాడి చేశాడు. దాడిలో నవీన్‌కుమార్‌ అనే కానిస్టేబల్‌ కానిస్టేబుల్‌ మెడ, ఛాతిపై గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం ఎన్బూరులో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

ఓటేశామని ఒట్టేయండి..!

రెండో విడుత కోసం అభ్యర్థులు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్న సమయంలోనే, మొదటి విడతలో ఓడిపోయిన అభ్యర్థులు కొన్నిచోట్ల తాము పంచిన బడ్బును ఓటర్ల నుంచి తిరిగి వసూలు చేసుకోవటం కనిపించింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అవురవాణి పంచాయతీలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో సీపీఎం బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోయారు. దీంతో తనవద్ద డబ్బు తీసుకుని ఓటు వేయలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఓ సామాజికవర్గం ఓటర్ల వద్దకు వెళ్లి తన డబ్బు తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. బాలరాజు దేవుడిచిత్రపటం, ఆయన భార్య క్రిమిసంహారక మందు డబ్బాను చేతుల్లో పట్టుకొని ‘ఓటేశామని ఒట్టు అయినా వేయండి.. లేదంటే మా డబ్బు అయినా తిరిగి ఇవ్వండి’ అని అడుగుతున్న వీడియో వైరల్‌గా మారింది.వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం వజారాలో మొదటి విడతలో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి లక్ష్మణ్‌యాక్‌.. ఓటర్లకు పంచేందుకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని మధ్యవర్తి దే వుడుతో గొడవపడ్డాడు. దీంతో దేవుడు అప్పటికప్పుడు తన సోదరుడి వద్ద రూ.90వేలు అప్పుచేసి లక్ష్మణ్‌నాయక్‌కు డబ్బు చెల్లించాడు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం ఎదిరలో బీజేపీ మద్దతుతో పోటీ చేసి ఓడిన అభ్యర్థి.. తాను పంచిన చీరలను తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను బూతులు తిట్టాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు అతడు ఇచ్చిన చీరలను తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు.


సర్పంచ్‌ ‘సాబ్‌’ ఖర్చు రూ.17 కోట్లు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో మొదటి విడతలో గెలిచిన సర్పంచ్‌ అభ్యర్థి రూ.17 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సదరు అభ్యర్థి గ్రామంలోని ఒక్కో ఓటుకు మూడు విడుతల్లో రూ.40వేల చొప్పున పంచాడని సమాచారం. కొందరు మహిళా ఓటర్లకు వెండిగ్లాసులు, చిన్నపాటి బంగారు నగలు కూడా పంపిణీ చేశారని సమాచారం. 780గృహాలున్న ఆ గ్రామం లో ఓటర్లకు ఖరీదైన మద్యం పంపిణీ చేయటంతో మద్యానికే రూ.4కోట్లు ఖర్చు అయ్యిందని చెప్పుకుంటున్నారు. 8 రోజుల ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పెట్టిన భోజనాల ఖర్చే రూ.కోటి వరకు అయ్యిందని సమాచారం. గజ్వేల్‌ డివిజన్‌లోని ఓ గ్రామంలో సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థి.. తాను రూ.15.50లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. తన ప్రత్యర్థి రూ.25 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రజలు తనవైపే నిలిచారని పేర్కొన్నారు. మరోవైపు గద్వాల జిల్లాలోని ఓ గ్రామంలో గెలిచిన అభ్యర్థి.. ఓడితే పరువు పోతుందన్న ఆలోచనతో 18లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పాడు. ఇది చూస్తుంటే రాజకీయంపై విరక్తి కలుగుతోందని వాపోయాడు.

Updated Date - Dec 14 , 2025 | 07:11 AM