Union Minister Kishan Reddy: యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లు
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:58 AM
హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు..
నిధులు మంజూరు, త్వరలో పనుల ప్రారంభం
రూ.36 కోట్లతో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో పనులు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
హైటెక్‌సిటీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. దీనికి అవసరమైన నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.720 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుండగా, నాంపల్లి స్టేషన్ అభివృద్ధికి రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఒకేసారి 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో గ్రేటర్ హైదరాబాద్‌లో 4 టెర్మినల్స్ ఉన్నాయన్నారు. రూ.26 కోట్ల వ్యయంతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో తొలి ఫేజ్ అభివృద్ధి పనులు పూర్తవుతాయని, అనంతరం రూ.10 కోట్లతో రెండో ఫేజ్ పనులు ప్రారంభిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. సంక్రాంతి సందర్భంగా హైటెక్ సిటీలో 16 రైళ్లకు స్టాప్స్ ఉంటాయన్నారు. ఇక్కడ నుంచి విశాఖ పట్నం, షిర్డి, ముంబై, మచిలీపట్నం, కాకినాడ, నర్సాపురం వెళ్లే రైళ్లు ఆగుతాయన్నారు. దసరా, దీపావళి సమయంలో దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ సదుపాయం కల్పించామన్నారు.