Telangana MLC Kavitha: కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను అంశాల వారీగానే విమర్శిస్తా
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:05 AM
కొంతమంది కారణంగానే కేసీఆర్‌కు చెడ్డ పేరు వస్తోందని.. బీఆర్‌ఎ్‌సను, కేసీఆర్‌ను అంశాల వారీగా మాత్రమే విమర్శిస్తానని ఎమ్మెల్సీ, తెలంగాణ ...
వారు కాదనుకున్నాకే రాజీనామా చేశా
మోసపూరిత వ్యక్తులదే పైచేయి అయ్యింది
‘జూబ్లీహిల్స్’పై నిర్ణయం తీసుకోలేదు
బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు అదే వస్తుంది: ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, అక్టోబరు 26, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కొంతమంది కారణంగానే కేసీఆర్‌కు చెడ్డ పేరు వస్తోందని.. బీఆర్‌ఎ్‌సను, కేసీఆర్‌ను అంశాల వారీగా మాత్రమే విమర్శిస్తానని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చారో తనకు తెలియదని.. ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానన్నారు. తాను బీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటే వారితో మాట్లాడేదాన్నని.. వారిని పార్టీలోనే ఉంచే ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తన విషయంలో పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని.. అసలు తాను బయటకు రావాలని అనుకోలేదన్నారు. నిజామాబాద్‌లో జనంబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఆదివారం ఓ హోటల్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లోనే పార్టీ బయటకు వచ్చానని.. వారు కాదనుకున్న తర్వాతే రాజీనామా చేశానని తెలిపారు. పార్టీలో ఉండగా మాట్లాడాల్సిన అన్ని చోట్ల మాట్లాడానని.. కానీ పార్టీకి నష్టం చేసే, బాధ్యత మరిచిన మోసపూరిత వ్యక్తులదే పైచేయి అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల కారణంగానే బీఆర్‌ఎస్, కేసీఆర్‌కు నష్టం జరగనుందన్నారు. ఐదేళ్ల క్రితమే ఎవరి పనితీరు ఏంటని తెలుసుకొని ఉంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయేది కాదని చెప్పారు. తాను బీఆర్‌ఎ్‌సలో తిరుగుబాటు చేయలేదని..అంత అవకాశమివ్వకుండానే బయటకు పంపారని చెప్పారు.
నా బాధ చెబుతా.. వారి బాధ వింటా!
‘నా బాధ ప్రజలకు చెబుతా.. వాళ్ల బాధ వింటా.. పరిష్కార మార్గానికి ప్రయత్నం చేస్తా..’ అని కవిత అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఏ పార్టీకి ఓటేయాలన్నది స్థానిక జాగృతి కార్యకర్తలే నిర్ణయం తీసుకుంటారన్నారు. పార్టీ పెట్టుడు పెద్ద పని కాదని, కానీ పార్టీ కన్నా కూడా ప్రజల సమస్యలు తీరడం ముఖ్యమని చెప్పారు. కేసీఆరే తనతో పార్టీ పెట్టిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ వాళ్లు తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని.. వాళ్లకే ప్రజల్లో ఏ ఆదరణ లేదని ఎద్దేవా చేశారు. అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. దాన్ని కూడా కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. తాను జనంబాటకు వస్తున్నానని తెలిసి ఓ బీజేపీ ఎంపీ తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. ఆయన అవినీతిని త్వరలోనే బయటపెడతానన్నారు.