kumaram bheem asifabad- రెండో రోజుకు చేరిన ఎమ్మెల్యే దీక్ష
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:07 PM
పోడు సమస్యను పరిష్కరించాలని, జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయాలని ఎమ్మెల్యే హరీష్‌బాబు తన నివాసంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిర్పూరు నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి మద్దతు పలికారు
కాగజ్‌నగర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పోడు సమస్యను పరిష్కరించాలని, జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయాలని ఎమ్మెల్యే హరీష్‌బాబు తన నివాసంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిర్పూరు నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి మద్దతు పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. జీవో 49 కేవలం తాత్కాలికంగా కాకుండా పూర్తిగా రద్దు చేశామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిర్పూరు నియోజకవర్గంలో అటవీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగడం లేదన్నారు. మంత్రి సీతక్క ఏరియాలో అటవీ ప్రాంతంలో అభివృద్ధి పనులకు అనుమతి ఇచ్చారని అన్నారు. తమ ప్రాంతానికి మాత్రం ఇంత వరకు అనుమ తులు రాలేదన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని తెలిపారు. నిరవధిక దీక్ష శిబిరాన్ని ఆసిఫాబాద్ మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు కార్యకర్తలు సందర్శించి మద్దతు పలికారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు ఆర్మీశివకుమార్, మాజీ కౌన్సిలర్ సిందం శ్రీనివాస్, ఆశోక్, చన్కపురి గణపతి, సాంబయ్య, బాల్కశ్యాం, తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సిఐ ప్రేంకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ఉదయం, సాయంత్రం వైద్యులు డాక్టర్ హరీష్ బాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
స్పీకర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే..:
పోడు సమస్య విషయంలో న్యాయం చేయాలని మంగశవారం శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఎమ్మెల్యే హరీష్‌బాబు లేఖ రాశారు. సిర్పూరు నియోకవర్గంలో పోడు పరిస్థితిని, అటవీ శాఖ అధికారుల వేధింపులు తదితర అంశాలను ప్రస్తావిస్తూ తాను నిరవధిక దీక్ష చేపడుతున్నట్టు ఆ లేఖలో వివరించారు.