Telangana PCC chief Mahesh Goud: ఎమ్మెల్యేలకూ డీసీసీ పదవులు!
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:17 AM
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష (డీసీసీ) పదవులకు ఎమ్మెల్యేలకు కూడా పోటీ పడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు...
అవసరమనుకున్న చోట ఇస్తాం
ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులూ తప్పు కాదు
సమన్వయ లోపంతోనే మంత్రుల మధ్య వివాదాలు
కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విధానం ఆక్షేపణీయం
కవిత యాత్రను స్వాగతిస్తున్నాం
పదేళ్ల పాపపు పాలనలో ఆమె భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాం
జూబ్లీహిల్స్‌లో గెలిచేది కాంగ్రెస్సే
ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
న్యూఢిల్లీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష (డీసీసీ) పదవులకు ఎమ్మెల్యేలకు కూడా పోటీ పడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి వారికి ఆ పదవులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇతర పదవుల్లో ఉన్నవారికి డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వబోమని చెప్పిన విషయం వాస్తవమేనని, కానీ.. ఆ పరిధిలోకి ఎమ్మెల్యేలు రారని అన్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికే అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మహేశ్‌గౌడ్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఐదుగురు ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ బలోపేతం కోసం అవసరమనుకున్న చోట ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తాం. వేరే పదవుల్లో ఉన్నవారైతే.. రాజీనామా చేయించి డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తాం. ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులను డబుల్ పోస్టులుగా చూడటం లేదు. అలాగే, ఒకే కుటుంబంలో రెండు పదవులు తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసమే కష్టపడేవాళ్లు ఒకే కుటుంబంలో ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్లకు పదవులు వద్దని ఎలా అంటాం? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి వంటి వాళ్ల ఇళ్లల్లో రెండు పదవులు వాళ్ల పనికి గుర్తింపుగా వచ్చినవే. ఉత్తమ్ పద్మావతి కూడా డీసీసీ పదవి కోసం దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ఈసారి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. కొన్ని జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకులు ఇచ్చిన పేర్లే కాకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కతోపాటు నేను ఇచ్చిన పేర్లు వేరుగా ఉన్నాయి. అన్నింటినీ అధిష్ఠానం పరిశీలిస్తోంది. అవసరమనుకుంటే మళ్లీ నన్ను ఢిల్లీకి పిలవొచ్చు. లేదంటే.. వారం, పదిరోజుల్లో డీసీసీ అధ్యక్షుల పేర్లను అధిష్ఠానమే ప్రకటిస్తుంది’’ అని మహేశ్ గౌడ్ తెలిపారు.
సమన్వయ లోపంతోనే వివాదాలు..
మంత్రుల మధ్య సమన్వయ లోపంతోనే వివాదాలు వస్తున్నాయని మహేశ్‌గౌడ్ అభిప్రాయ పడ్డారు. ‘‘మంత్రి కొండా సురేఖ దగ్గర పనిచేసిన సుమంత్ ఒక ఇంట్లోకి వెళ్లాడు. ఆయనను వెంబడిస్తూ పోలీసులు వెళ్లారు. అది మంత్రి అధికారిక నివాసం కాదు. ఇంతలోనే సురేఖ కుమార్తె కిందికి వచ్చి పానిక్ అయి అలా మాట్లాడారు. ఎవరు, ఎవరినైనా కులం పేరుతో విమర్శిస్తే ఊరుకోం. ఆమెను మందలించాం. అసలు.. ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు కాదు. పొన్నం ప్రభాకర్ విషయంలోనూ ఇటువంటిదే జరిగింది. ఇక జీవన్‌రెడ్డి శిష్యుడే అడ్లూరి లక్ష్మణ్. ఇవన్నీ.. సమన్వయలోపంతో వచ్చినవే. అన్నీ సద్దుమణిగాయి. కాంగ్రెస్ పార్టీలో ఓపికగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రె్‌సలో కార్యకర్త నుంచి మంత్రి వరకు ఎవరైనా పార్టీ నియమాలకు లోబడే ఉండాలి. నాతో సహా అందరం హైకమాండ్ రాడార్‌లో ఉన్నాం’’ అని పీసీసీ చీఫ్ అన్నారు. మంత్రుల మధ్య వివాదం హరీశ్‌రావు, కేటీఆర్‌లకు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టే అయ్యిందన్నారు. ముందుగా వారి కుటుంబంలోని పంచాయితీని సరిదిద్దుకోవాలని హితవు పలికారు. క్యాబినెట్ భేటీలో మంత్రుల పనితీరు, సమన్వయలోపం వంటి అంశాలన్నింటిపైనా సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు చేశారని తెలిపారు.
కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం
ఎమ్మెల్సీ కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నట్లు మహేశ్‌గౌడ్ తెలిపారు. గత పదేళ్ల పాలనలోని అవినీతి గురించి కవిత చెప్పినవన్నీ నిజాలేనన్నారు. అయితే, కవిత సగం మాత్రమే నిజాలు చెప్పారని, మరో సగం చెప్పాల్సి ఉందని అన్నారు. అలాగే, గత పదేళ్ల పాపపు పాలనలో కవితకూ భాగస్వామ్యం ఉన్నందున ఆమెను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలన్నారు. ‘‘రాముడి పేరుతో రాజకీయం చేయడం తప్ప.. కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ అభివృద్ధికి ఏం చేశారు? జూబ్లీహిల్స్‌లోనూ బీజేపీ మతం పేరుతో రాజకీయం చేయాలని చూస్తోంది. పీజేఆర్ నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయం ఉండగా.. మళ్లీ ఇప్పుడు బండి సంజయ్ పెద్దమ్మ ఆలయం నిర్మిస్తాననడమేంటి? గుళ్లు, గోపురాలను బీజేపీ వాడుకుంటోంది. వేల ఏండ్ల కిందటే శ్రీరాముడు ఏలాడు. కానీ, దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 40 ఏండ్లకు బీజేపీ పుట్టింది. అలాంటప్పుడు బీజేపీకి శ్రీరాముడితో ఏం సంబంధం? ఎవరెన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలిచి తీరుతాం. మాగంటి కుటుంబ విషయాలు మీడియాలో చూసిన తర్వాతే మాకు తెలిసింది. అంతే తప్ప.. కేటీఆర్‌లా వేరేవాళ్ల కుటుంబాల్లోకి తొంగిచూేస అలవాటు మాకు లేదు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీనే జూబ్లీహిల్స్‌లో ఓటు చోరీ చేసింది. ఓటు చోరీ గురించి తొలిసారి ఫిర్యాదు చేసిందే రేవంత్‌రెడ్డి’’ అని మహేశ్‌గౌడ్ అన్నారు.
ఉద్యమ నేతగా కేసీఆర్ అంటే గౌరవమే...
తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ అంటే తనకెప్పుడూ గౌరవమేనని మహేశ్ గౌడ్ తెలిపారు. ఆయనతోపాటు ఉద్యమంలో పాల్గొన్నామని, ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాడామని చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనపైనే తమ అభ్యంతరమని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ ఉదాసీనత వల్లే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చిందన్నారు. కాగా, ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డితో మహేశ్ గౌడ్ భేటీ అయ్యారు. 15 జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష పదవులకు తీవ్ర పోటీ ఉన్నందున ఇరువురూ సమాలోచనలు చేసినట్టు సమాచారం.