MLA Madhavaram Krishna Rao: ఐడీపీఎల్ భూములపై సమగ్ర విచారణ చేయండి
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:58 AM
ఐడీపీఎల్ భూముల వివాదంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు....
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోండి
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లేఖ
కూకట్‌పల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఐడీపీఎల్ భూముల వివాదంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాధవరం కృష్ణారావు శుక్రవారం లేఖలు పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఐడీపీఎల్ భూముల అంశంలో ప్రభుత్వ పరంగా పూర్తిస్తాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తాను అక్రమాలు చేసినట్లు రుజువైతే చట్ట ప్రకారం తనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కుత్బుల్లాపూర్ మండలం, గాజుల రామారం పరిధిలోని సర్వే నంబర్ 307లోని సుమారు 317 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించి ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. అలాగే కూకట్‌పల్లి, బాలానగర్ సీఎస్ 14, సీఎస్ 7కు సంబంధించిన వందలాది ఎకరాల భూముల విషయంలో కూడా సమగ్ర విచారణ చేపట్టాలని కోరానని తెలిపారు.