MLA B. Lakshmareddy: లారీలు అమ్మి సీఎం ఫండ్‌కు రూ.2 కోట్లు ఇచ్చా
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:20 AM
తన తొమ్మిది లారీలు అమ్మి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు చెక్కు రూపంలో అందజేశానని, ఇందుకోసం తాను ఎవరి వద్ద రూపాయి కూడా...
ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తన తొమ్మిది లారీలు అమ్మి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్లు చెక్కు రూపంలో అందజేశానని, ఇందుకోసం తాను ఎవరి వద్ద రూపాయి కూడా వసూలు చేయలేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2 కోట్ల విరాళం అందజేతపై స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న విమర్శలపై ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తన కుమారుడి వివాహం తర్వాత రిసెప్షన్ కోసం తన పేరిట, కుమారుడు, భార్య పేరున ఉన్న తొమ్మిది లారీలు విక్రయించగా రూ.1.85 కోట్లు వచ్చాయన్నారు. అదే సమయంలో యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతుండటంతో వారి సంక్షేమ కోసం వేడుకకు సిద్ధం చేసిన నగదును సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కు రూపేణా అందజేశామని తెలిపారు. తాను అక్రమంగా సంపాదించానని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని.. ఎవరి వద్ద వసూళ్లకు పాల్పడలేదని, ఈ విషయమై ఏ దేవుని ముందైనా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని స్పష్టం చేశారు. తన కుటుంబ సభ్యుల పేరున గతంలో ఉన్న 162 వాహనాల్లో ఇప్పటికే 92 లారీలను విక్రయించానన్నారు. వ్యక్తిగత ప్రచారాలతో పార్టీపై విషం చిమ్మవద్దన్నారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసే వారెవరో తనకు తెలుసునని, అలాంటి వారికి తాను మద్దతు ఇవ్వబోనని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.