Share News

Munugode MLA Komatireddy Rajagopal Reddy: మునుగోడులో ఇతరులు మద్యం టెండర్లు వేయొద్దు

ABN , Publish Date - Oct 15 , 2025 | 03:53 AM

మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాలకు చెందిన వారు టెండర్లు వేయవద్దు. ఈ నియోజకవర్గంలో...

Munugode MLA Komatireddy Rajagopal Reddy: మునుగోడులో ఇతరులు మద్యం టెండర్లు వేయొద్దు

  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

  • ఫోన్లో సంభాషణ.. ఎమ్మెల్యే ఎక్స్‌ ఖాతాలో పోస్టు

  • టెండరుదారులు ఎవరికీ భయపడకుండా దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్‌శాఖ సూచన

నల్లగొండ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ‘మునుగోడు నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాలకు చెందిన వారు టెండర్లు వేయవద్దు. ఈ నియోజకవర్గంలో పర్మిట్‌రూములు, బెల్టుషాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ నడవనీయం. నాకు పదవి కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. రాష్ట్రంలో ఎక్సైజ్‌ పాలసీని సమీక్షించి, ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాను’ అని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఇదే విషయం గురించి పలువురు పార్టీ నేతలతో ఆయన ఫోన్లో మాట్లాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సంభాషణను ఆయన ఎక్స్‌ ఖాతాలో మంగళవారం ఉదయం పోస్ట్‌ చేశారు. మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొనే వ్యాపారులనుద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సోమవారం ఇదే అంశాన్ని పేర్కొంటూ మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు నల్లగొండ జిల్లా ఎక్సైజ్‌శాఖ అధికారి సంతో్‌షకుమార్‌కు వినతిపత్రం కూడా అందజేశారు. కాగా, మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొనేవారు వారు ఎవరి ఒత్తిడికి లోనుకాకుండా నిర్భయంగా దరఖాస్తులు సమర్పించాలని నల్లగొండ జిల్లా ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ అధికారి ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా సిండికేట్‌ అయినా, తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడానికి కారణమైనా, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే చర్యలు చేసినవారిపై చట్టపర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Updated Date - Oct 15 , 2025 | 03:53 AM