Share News

Komatireddy Rajagopal Reddy: నేనెందుకు రాజీనామా చేస్తా

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:48 AM

కాంగ్రెస్‌ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు అబద్ధమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

 Komatireddy Rajagopal Reddy: నేనెందుకు రాజీనామా చేస్తా

  • కొత్త పార్టీ పెడుతున్నానడం.. అవాస్తవం

  • సోషల్‌ మీడియా ప్రచారం నమ్మొద్దు

  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చిట్యాలరూరల్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు అబద్ధమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. అయినా.. తానెందుకు రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నానని, కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కాంగ్రెస్‌, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అంటే ఎంతో అభిమానమని, తమ కుటుంబ నేపథ్యం కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు వెళ్లే క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులోని ఓ హోటల్‌ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో దుర్గమ్మ వారిని దర్శించుకుని, అక్కడినుంచి గుంటూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను వెళ్తుంటే.. ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వెళుతున్నానంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి తానే మీడియా సమావేశం నిర్వహించి చెబుతానని, ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదంటూ తాను మాట్లాడినట్టుగా, ఆ విషయం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైనట్టుగా, సీఎం రేవంత్‌పై తాను ఎలాంటి విమర్శలు చేయకపోయినా.. చేసినట్టుగా ప్రచారం చేస్తూ తన ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. కాగా, గుంటూరులో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాన్వాయ్‌లో 70కార్లు ఉండడం ఆసక్తి రేకెత్తించింది.

Updated Date - Sep 19 , 2025 | 08:03 AM