Share News

KTR: ఎమ్మెల్యేలను దొంగిలించడం పెద్ద నేరం

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:57 AM

ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడం రాహుల్‌ గాంధీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని, ఆయనకు సిగ్గుశరం ఉంటే..

KTR: ఎమ్మెల్యేలను దొంగిలించడం పెద్ద నేరం

  • రాహుల్‌ది రెండు నాల్కల ధోరణి

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

  • రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్‌ ఎన్నిక నిర్ణయిస్తుంది: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడం రాహుల్‌ గాంధీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని, ఆయనకు సిగ్గుశరం ఉంటే.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని బీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఓట్లచోరీ ఒక నేరమైతే, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగిలించడం అంతకంటే పెద్ద నేరమని, అది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్‌ బూత్‌స్థాయి బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ఫిరాయింపు రాజకీయాలను అందరూ అసహ్యించుకుంటున్నారని, సరైన సమయంలో ఆపార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడానికి సిద్థంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీల జాయింట్‌ వెంచర్‌ రేవంత్‌రెడ్డి ప్రభుత్వమని, మోదీ ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్‌ సవరణలను దేశంలో అందరి కంటేముందు తెలంగాణ ప్రభుత్వమే అమలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలయినా ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టలేదని, ఓట్ల కోసం వచ్చే మంత్రులు, కాంగ్రెస్‌ నేతలను ముస్లింలు నిలదీయాలన్నారు. రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నిర్ణయిస్తుందని, అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్‌లో కాల్చివాత పెట్టాలన్నారు. మాగంటి గోపీనాథ్‌ సేవల్ని కొనసాగిస్తామని ప్రజలముందుకు వచ్చిన ఆయన సతీమణి సునీతమ్మను అందరూ ఆశీర్వదించాలని కోరారు. కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంచి తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 52 4అడుగులకు పెంచాలని కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే సీఎంకు ఏమాత్రం పట్టడంలేదని ఆయన అన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 04:57 AM