MLA Anirudh Reddy: అరబిందో పరిశ్రమను కాలబెడతా
ABN , Publish Date - Sep 27 , 2025 | 03:01 AM
రైతులకు నష్టం కలిగించే విధంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అరబిందో ఫార్మా పరిశ్రమపై చర్యలు తీసుకుంటారా లేదంటే పరిశ్రమను కాలబెట్టమంటారా...
పీసీబీకి ఒక్క రోజే గడువు... కాలుష్య సమస్యపై చర్యలు తీసుకోవాలి
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రైతులకు నష్టం కలిగించే విధంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అరబిందో ఫార్మా పరిశ్రమపై చర్యలు తీసుకుంటారా ? లేదంటే పరిశ్రమను కాలబెట్టమంటారా ? అంటూ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. అరబిందోపై చర్యలు తీసుకునేందుకు పీసీబీకి ఒక్క రోజే గడువు ఇస్తున్నానని, స్పందించకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు తానే స్వయంగా పరిశ్రమను కాలబెడతానంటూ ఓ వీడియోలో ఆయన హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాయు, జల కాలుష్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి శుక్రవారం పంపిన పలువురు రైతులు కాలుష్యం బారి నుంచి తమని రక్షించాలని వేడుకున్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. అరబిందో పరిశ్రమ కాలుష్యం అంశంలో పీసీబీని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. రైతులు తనకు పంపిన ఫొటోలు, వీడియోలను దానికి జత చేశారు. పోలేపల్లి సెజ్‌లోని అరబిందో ఫార్మా పరిశ్రమ కలుషిత నీటిని వదులుతోందని, అలా వదిలితే పరిశ్రమను కాలబెడతానంటూ తాను ఇదివరకు ప్రకటించినట్టు చెప్పారు. కాలుష్యం అంశంపై పీసీబీ చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో కూడా మాట్లాడానని పేర్కొన్నారు. కానీ, పీసీబీ అధికారులు, అరబిందో యాజమాన్యం ఒక్కటైనట్టున్నారని, రైతుల సమస్యను పట్టించుకోరని అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, తన ఓపిక నశించిందని స్పష్టం చేశారు. పీసీబీకి ఒక్క రోజు సమయం ఇస్తున్నానని ఆ లోగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అరబిందో పరిశ్రమ ముందుకు స్వయంగా వెళ్లి కాలబెడతానంటూ అనిరుధ్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. వేలు, లక్షల కోట్లు సంపాందిచుకున్న అరబిందో పరిశ్రమ వల్ల పంటనష్టం జరుగుతుందని, చెరువుల్లో చేపలు చనిపోతున్నాయన్నారు. ఆదివారం వరకు గడువు ఇస్తున్నానని పీసీబీ, అరబిందో యాజమాన్యం స్పందించి ఒక్క రోజులోపు తప్పు సరిదిద్దుకుంటే మంచిదని, లేనిపక్షంలో పరిశ్రమను కాలబెట్టడం గ్యారెంటీ అని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.