GHMC: విలీనంతో లాభమా..? నష్టమా..?
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:41 AM
జీహెచ్‌ఎంసీలో శివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై మిశ్రమ స్పందన వస్తోంది. పన్నులు, పౌర సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మార్పులు ఉంటాయన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. విలీనంతో పన్నులు పెరిగే అవకాశముందని కొన్ని మునిసిపాలిటీల్లో చెబుతుండగా..
జీహెచ్‌ఎంసీ శివారు మునిసిపాలిటీల్లో చర్చ.. పన్ను హెచ్చు తగ్గులపై భిన్నాభిప్రాయాలు
మౌలిక సదుపాయాల మెరుగుదలపై ఆశలు
సేవల్లో పారదర్శకతపై స్థానికుల్లో ఆందోళన
విలీన కసరత్తులో పురపాలక శాఖ బిజీ
హైదరాబాద్ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీలో శివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంపై మిశ్రమ స్పందన వస్తోంది. పన్నులు, పౌర సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మార్పులు ఉంటాయన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. విలీనంతో పన్నులు పెరిగే అవకాశముందని కొన్ని మునిసిపాలిటీల్లో చెబుతుండగా.. మరి కొన్ని చోట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్తులతో పోలిస్తే తాము ఇప్పుడు ఎక్కువ పన్ను చెల్లిస్తున్నామని.. విలీనంతో అది తగ్గుతుందని పేర్కొంటున్నారు. మణికొండ, నార్సింగి, తెల్లాపూర్‌లో జీహెచ్‌ఎంసీతో పోలిస్తే అధిక పన్ను చెల్లిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ‘గ్రౌండ్‌తో కలిపి రెండంతస్తుల భవనానికి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏటా రూ.12 వేలు చెల్లిస్తుండగా.. మేం అంతే విస్తీర్ణంలో ఉన్న నిర్మాణానికి రూ.26 వేలకుపైగా పన్ను చెల్లిస్తున్నాం’ అని మణికొండ వాసి ఒకరు పేర్కొన్నారు. విలీనంతో ఈ వ్యత్యాసం తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెల్లాపూర్‌లోనూ కొందరు స్థానికులు తాము బల్దియాతో పోలిస్తే ఎక్కువ పన్ను చెల్లిస్తున్నామని చెబుతున్నారు. బోడుప్పల్‌లోని ఓ వ్యక్తి ఇందుకు భిన్నంగా స్పందించారు. తాను ఇప్పుడు రూ.10 వేల పన్ను చెల్లిస్తున్నానని, జీహెచ్‌ఎంసీలో కలిపితే పన్ను పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ, జల్‌పల్లి, బడంగ్‌పేట, మీర్‌పేట తదితర మునిసిపాలిటీల్లోనూ కొందరు పన్ను పెరుగుతుందేమోనని అనుమాన పడుతున్నారు.కాగా, ‘మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే పన్ను మదింపు జరుగుతోంది. హెచ్చు,తగ్గులు ఉంటే సర్కారు తీసుకునే నిర్ణయం ఆధారంగా హేతుబద్ధీకరణ జరగాల్సి ఉంటుంది’ అని ఓ అధికారి తెలిపారు.
కేంద్రీకృతమైతే ఏమవుతుందో..?.
జీహెచ్‌ఎంసీ శివార్లలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ప్రస్తుతం అధికారులు, సిబ్బంది.. స్థానికులకు కొంత అందుబాటులో ఉంటున్నారు. చిన్నా చితక సమస్యలపై ఫిర్యాదు చేస్తే స్పందించే అవకాశముంది. అదే జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తే ఈ పరిస్థితి ఉండదేమోనన్న భయం కొందరిలో ఉంది. పాలన కేంద్రీకృతమైతే ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరుగుతుందేమోనని నిజాంపేటకు చెందిన ఒకరు పేర్కొన్నారు. ‘విలీనం అనంతరం పాలనా వ్యవస్థ ఎలా ఉంటుందో..? సర్కిల్, జోనల్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుందా..? వార్డుల వారీగా ఆఫీసులు ఉంటాయా..?’ అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే 27 మునిసిపాలిటీల్లో ప్రస్తుతం మణికొండ, నార్సింగి, నిజాంపేట, బడంగ్‌పేట, అమీన్‌పూర్ వంటి చోట్ల ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతులు, ఇతరత్రా ఆదాయం రూ.40-70కోట్ల వరకు ఉండగా.. కొన్ని చోట్ల 10కోట్లకూ చేరుకోవడం లేదు. భవన నిర్మాణాలు ఎక్కువగా జరిగే చోట ఆదాయం అధికంగా ఉండగా.. ఇతర మునిసిపాలిటీల్లో పరిస్థితి తీసికట్టుగా ఉంది. కొన్ని మునిసిపాలిటీల్లో వెలగని వీధి దీపం మార్చేందుకూ రోజుల సమయం పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో విలీనంతో తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న భావనా కొందరిలో వ్యక్తమవుతోంది. వేతనాలు, అప్పులకు వాయిదాలు చెల్లించాల్సిన జీహెచ్‌ఎంసీ పరిస్థితి.. నెల గడిస్తే చాలన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వంనిధులిస్తే తప్ప విలీన మునిసిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితి ఉండదు.
అత్యంత గోప్యంగా ప్రక్రియ..
జీహెచ్‌ఎంసీలో ఔటర్ లోపల, రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న 20 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేయాలని ఇటీవల మంత్రి వర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కసరత్తు మొదలైంది. భౌగోళిక స్వరూపం, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని జనాభా, ఆయా సంస్థల వారీగా ఆదాయం, వ్యయం, వేతనాల చెల్లింపు, ఉత్పత్తి అవుతోన్న చెత్త, మౌలిక సదుపాయాలు ఏ మేరకు ఉన్నాయన్న వివరాలను పురపాలక శాఖ సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన అధ్యయన బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కు జీహెచ్‌ఎంసీ అప్పగించింది. విలీనం అనంతరం మెగా కార్పొరేషన్‌ను రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు అత్యంత రహస్యంగా చేపడుతున్నారు.