Lokeshwar Rao Sajja: గుండె కవాటం మార్చకుండానే దీర్ఘాయుష్షు!
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:39 AM
దెబ్బతిన్న గుండె కవాటాన్ని పూర్తిగా మార్పిడి చేయకుండా.. మరమ్మతు చేయడం ద్వారా ఎక్కువకాలం జీవించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది...
మిట్రల్ వాల్వ్ రిపేర్‌తో జీవితకాలాన్ని 20ఏళ్ల వరకు పెంచుకోవచ్చు
స్టార్ ఆస్పత్రి వైద్యుడు లోకేశ్వరరావు సజ్జా అధ్యయనం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): దెబ్బతిన్న గుండె కవాటాన్ని పూర్తిగా మార్పిడి చేయకుండా.. మరమ్మతు చేయడం ద్వారా ఎక్కువకాలం జీవించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. స్టార్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ లోకేశ్వరరావు సజ్జా.. 20 ఏళ్లపాటు సుదీర్ఘ అధ్యయనం చేసి, నివేదిక రూపొందించారు. సాధారణంగా గుండెపోటు, ఇతర కారణాలతో గుండె ఎడమవైపు గదుల మధ్య కవాటం (మిట్రల్ వాల్వ్) వదులుకావడం, దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. దీనిని ‘ఇస్కీమిక్ మిట్రల్ రెగ్యుర్జిటేషన్’ అంటారు. కవాటం నుంచి రక్తం లీకవుతూ, గుండె పనితీరు దెబ్బతిని మరణానికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారిలో ‘కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (సీఏబీజీ)’ శస్త్రచికిత్స చేసి, కవాటాలను మార్పిడి చేస్తూంటారు. అయితే కవాటాన్ని మార్పిడి చేయాల్సిన అవసరం లేదని, మరమ్మతు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సుదీర్ఘకాలం జీవించవచ్చని లోకేశ్వరరావు అధ్యయనంలో గుర్తించారు. ఈ నెల 11, 12 తేదీల్లో అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన సదస్సులో దీనికి సంబంధించిన నివేదికను సమర్పించారు. 20 ఏళ్లపాటు 212 మందిపై ఈ అధ్యయనం చేశానని, ‘ఇస్కీమిక్ మిట్రల్ రెగ్యుర్జిటేషన్’పై ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సుదీర్ఘ డేటాసెట్‌లలో ఇది ముఖ్యమైనదని ఆయన తెలిపారు. ‘మిట్రల్ వాల్వ్’ మరమ్మతు చేసిన వారిలో.. 80శాతం మంది 20 ఏళ్ల తర్వాత కూడా జీవించి ఉండగలరని తేలిందని వివరించారు. ఈ చికిత్స తర్వాత ఏడాది పాటు 97.6శాతం మంది, ఐదేళ్లపాటు 94.23ు పదేళ్లపాటు 88.7ు, 12 ఏళ్లపాటు 81.7ు, 20 ఏళ్లపాటు 81.1 శాతం మంది రోగులు జీవితకాలాన్ని అనుభవించారని తెలిపారు.