Misuse Funds: పర్యాటక సంస్థలో నిధుల దుర్వినియోగం
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:09 AM
పర్యాటక సంస్థలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది...
ఇద్దరు అధికారుల సస్పెన్షన్
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): పర్యాటక సంస్థలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సంస్థలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు కుమ్మక్కై సుమారు మూడేళ్లుగా రూ.5కోట్లకు పైగా నిధులను దారిమళ్లించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. సంస్థలోని ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారుల సహకారంతో ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తన వ్యక్తిగత ఖాతాకు సుమారు రూ.1.25 కోట్లకు పైగా సంస్థ నిధులను మళ్లించినట్టు, ఇతర విభాగాల్లో కూడా పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమైనట్లు అధికారుల ప్రాధమిక విచారణలో స్పష్టమైంది. దీంతో ఆయా విభాగాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులపై మరింత లోతుగా విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. నిధుల మళ్లింపు ఘటనకు బాధ్యులుగా ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారులను సస్పెండ్ చేస్తూ సంస్థ ఎండీ క్రాంతి వల్లూరి ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం మరికొంత మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.