Miss World Opal Suchatshri: తెలంగాణ నాకెంతో ప్రత్యేకం
ABN , Publish Date - Jun 10 , 2025 | 07:04 AM
తెలంగాణ నాకు ఎంతో ప్రత్యేకం.. ఇక్కడ సాధించిన ప్రపంచ సుందరి కిరీటం కేవలం నా దేశం థాయ్‌లాండ్‌కే కాదు.. మొత్తం ప్రపంచానికీ గుర్తుండిపోతుంది. 40 రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాను. తెలంగాణ పర్యాటకం, సంస్కృతిని పరిశీలించాను.
అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని సాధించాం: జూపల్లి
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ నాకు ఎంతో ప్రత్యేకం.. ఇక్కడ సాధించిన ప్రపంచ సుందరి కిరీటం కేవలం నా దేశం థాయ్‌లాండ్‌కే కాదు.. మొత్తం ప్రపంచానికీ గుర్తుండిపోతుంది. 40 రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నాను. తెలంగాణ పర్యాటకం, సంస్కృతిని పరిశీలించాను. ఇక్కడి ఆతిథ్యాన్ని స్వీకరించాను. హైదరాబాద్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని మిస్ వరల్డ్ విజేత ఓపల్ సుచాతశ్రీ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. మిస్ వరల్డ్ పోటీలుముగిసిన సందర్భంగా.. సోమవారం మాదాపూర్‌లోని తెలంగాణ ఆర్ట్ గ్యాలరీలో ‘చాంపియన్స్ బిహైండ్ ద క్రౌన్’ పేరుతో పర్యాటకశాఖ కృతజ్ఞత సభ నిర్వహించింది. పోటీల విజయవంతానికి కృషి చేసిన పలు శాఖలతోపాటు మీడియా ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా సుచాతశ్రీ మాట్లాడుతూ.. మిస్‌వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక్కడి పర్యాటక ప్రాంతాలను వినూత్న రీతిలో ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పోటీలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినా.. విజయవంతంగా నిర్వహించామన్నారు. తెలంగాణ పర్యాటకం, సంస్కృతిని ప్రపంచానికి చాటాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందన్నారు.