Minor Girl Assault: ఆరో తరగతి విద్యార్థిపై తొమ్మిదో తరగతి విద్యార్థుల లైంగిక దాడి
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:21 AM
ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిపై తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో...
నిర్మల్ జిల్లాలోని మస్కాపుర్ బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఘటన
ఖానాపూర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిపై తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపుర్ బీసీ విద్యార్థి వసతి గృహంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మస్కాపుర్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు స్థానిక బీసీ సంక్షేమ వసతి గృహంలో ఉంటున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 21వ తేదీన అర్ధరాత్రినిద్రలేపి వసతిగృహం పక్కకు తీసుకెళ్లారు. అక్కడ ఆ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయాన్ని బాధిత విద్యార్థి తన కుటుంబసభ్యులకు తెలుపగా వారు విద్యార్థిని పాఠశాల నుంచి టీసీ తీసుకుని, హాస్టల్ ఖాళీ చేయించి తీసుకెళ్లారు. లైంగిక దాడి ఘటనను తోటి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోనగిరి నరేందర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై ఆందోళన చెందిన ప్రధానోపాధ్యాయుడు హాస్టల్ వార్డెన్ ప్రకాశ్‌ను ఆరా తీశారు. ఈ వికృత చేష్టలకు పాల్పడిన ఇద్దరు విద్యార్థుల కుటుంబసభ్యులను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించి వారిద్దరికీ ఈ నెల 23న టీసీ ఇచ్చి పంపించారు. సదరు వసతి గృహంలో, పాఠశాలలో ఇటువంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.