Ministers Ponnam Prabhakar: ఉపాధిని ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:47 AM
పట్టణ ప్రాంతాలకు సైతం ఉపాధి హామీ పథకాన్ని విస్తరిస్తామని ఎన్నికల అజెండాలో ప్రకటించిన బీజేపీ.. అసలు పథకాన్నే ఎత్తేయడానికి గాంధీ పేరు మార్చేసి కుట్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు.
గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీల పేర్లు చరిత్రలో లేకుండా చేస్తున్నారు: మంత్రి పొన్నం
పేదల పథకాలను తొలగిస్తున్న బీజేపీ: మంత్రి వివేక్
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాలకు సైతం ఉపాధి హామీ పథకాన్ని విస్తరిస్తామని ఎన్నికల అజెండాలో ప్రకటించిన బీజేపీ.. అసలు పథకాన్నే ఎత్తేయడానికి గాంధీ పేరు మార్చేసి కుట్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. పేదలకు ఉపాధి కల్పించే ప్రధాన లక్ష్యంతో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్‌లతో కలిసి పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించకుండా అసలు పథకాన్నే నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై బీజేపీ సర్కారు ఆర్థిక భారం వేసిందని మండిపడ్డారు. గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని చూస్తోందని విమర్శించారు. అన్ని గ్రామాల్లో మొదటి గ్రామసభలో మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ తీర్మానం చేసి కాపీని ప్రధాని మోదీకి పంపించాలని కొత్త సర్పంచ్‌లకు సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదలకు ఉపయోగపడే పథకాలను అమలు చేస్తే మోదీ ప్రభుత్వం తొలగించేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రమే 90 శాతం నిధులు కేంద్రం కేటాయించాలని డిమాండ్ చేశారు. అజారుద్దీన్ మాట్లాడుతూ.. ప్రపంచమంతా గాంధీ ేసవలను కొనియాడుతుంటే బీజేపీకి అది నచ్చట్లేదని.. అందుకే ఆ పథకానికి గాంధీ పేరు తొలగించారని మండిపడ్డారు.