Minister Seethakka: నాణ్యత లేని గుడ్లు సరఫరా చేస్తే కాంట్రాక్టు రద్దు
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:38 AM
అంగన్‌వాడీ కేంద్రాలు అంటే హోటళ్లు కావు. నాసిరకం గుడ్లు, సరుకులు పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. ఇది మీకు చివరి అవకాశం....
హాస్టళ్లు, అంగన్‌వాడీలకు ఇచ్చే గుడ్లు నిబంధనల మేరకు ఉండాల్సిందే
ఇదే మీకు చివరి అవకాశం
కాంట్రాక్టర్లకు మంత్రి సీతక్క తీవ్ర హెచ్చరిక
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘అంగన్‌వాడీ కేంద్రాలు అంటే హోటళ్లు కావు. నాసిరకం గుడ్లు, సరుకులు పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. ఇది మీకు చివరి అవకాశం. ఇకపై నాణ్యతలేని చిన్న సైజు గుడ్లు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పది రోజులకు ఒకసారి గుడ్లు సరఫరా చేయాలి. కుంటి సాకులు చెబితే కాంట్రాక్టు రద్దు చేస్తాం. పిల్లలు దేవుళ్లతో సమానం. వారికి అందించే ఆహారంలో రాజీ లేదు’ అని మంత్రి సీతక్క కాంట్రాక్టర్లను హెచ్చరించారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారుల అలసత్వంపై మంత్రి సీరియస్ అయ్యారు. గురుకులాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లకు గుడ్ల సరఫరాలో అవకతవకలపై ఆంధ్రజ్యోతిలో సోమవారం ‘చిన్న గుడ్డు.. పెద్ద మోసం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు సీతక్క మంగళవారం మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనరేట్లో కోడిగుడ్లు, పప్పు, పాల సరఫరాదారులు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. టెండర్ మార్గదర్శకాలు అంగీకరించిన తర్వాతే గుడ్ల సరఫరా కాంట్రాక్టులు ఇచ్చామని అన్నారు. ఆ నిబంధనల ప్రకారమే సప్లై చేయాలని స్పష్టం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో గుడ్లు త్వరగా పాడవుతున్నాయని, అందుకే ప్రతి 10 రోజులకు ఒకసారి సప్లై చేయాలన్నారు. బాలలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతని, అధికారులు పర్యవేక్షణ పెంచాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సీతక్క హెచ్చరించారు. ఇక నుంచి కచ్చితంగా ప్రతి 3నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమీక్ష సందర్భంగా.. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని మంత్రి సీతక్క పలుమార్లు గుర్తు చేసినట్లు సమాచారం.