Minister Vakiti Srihari Criticizes KTR: కేటీఆర్.. పేదల కడుపు నింపడంమాకు గొప్పే
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:12 AM
పేదల కడుపు నింపడం తమకు గొప్ప విషయమేనని మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు....
ప్రతి పేదవాడికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నాం
జూబ్లీ హిల్స్‌లో కొత్తగా 14 వేల రేషన్ కార్డులిచ్చాం
బీఆర్‌ఎస్ చేయలేనిది కాంగ్రెస్ చేసి చూపిస్తోంది
అది ఓర్వలేకే కేటీఆర్ అహంకార ధోరణితో మాటలు
మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్/వెంగళరావు నగర్, నవంబరు 5 (ఆంధ్ర జ్యోతి): పేదల కడుపు నింపడం తమకు గొప్ప విషయమేనని మంత్రి వాకిటి శ్రీహరి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రేషన్ కార్డులతో పాటు ప్రతి పేదవాడికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. పేద ప్రజల కడుపు నింపడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డులు చూసి... వారు చేయనిది తాము చేస్తున్నామని ఓర్వలేక అహంకార ధోరణితో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుధవారం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. శ్రీహరి మాట్లాడుతూ అంబేడ్కర్ ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు అని, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించే వారికి ఓటేస్తేనే రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించిన ఓటు హక్కుకు విలువ ఉంటుందన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మూడుసార్లు బీఆర్‌ఎ్‌సకు అధికారం ఇచ్చిన తరువాత కూడా ఇంకా ఈ ప్రాంతంలో మురికి కాలువలు, హై టెన్షన్ వైర్లు, తాగునీటి సమస్యలు ఎందుకున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈప్రాంత అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు ఏదో చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు మాయమాటలు చెబుతున్నారని, వాటిని నమ్మి ప్రజలు మోసం పోవద్దన్నారు. ఆ పార్టీ చెల్లుబాటు అయ్యే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. కాంగ్రె్‌సతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని, ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 14 వేల నూతన రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు అప్పటికే ఉన్నవాటిలో కొత్తగా 8 వేల మందిని చేర్చామని చెప్పారు. దాదాపు 20 వేల కుటుంబాలకు 1,14,206 పైగా గ్యాస్ సిలిండర్లు రూ.500కే ఇచ్చామని, దీంతో ప్రజలకు రూ.3.6 కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి, మహిళా సాధికారితే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడు దశాబ్దాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణను చేసిన మొదటి ప్రభుత్వం తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ ఎమ్మెల్యే ఏ మోహన్, మేడి పాపన్న, దేవని సతీశ్ మాదిగ, దళిత నాయకులు పాల్గొన్నారు.