Minister Uttam Kumar Reddy: మీ పాలనలోనే అన్యాయం
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:29 AM
నీటిపారుదల ప్రాజెక్టులపై ఉద్యమాలు చేయడం కాదు... ముందు చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు....
ఉమ్మడి రాష్ట్రంలో కంటే రెండు రెట్లు మేర జలదోపిడీ జరిగింది: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): నీటిపారుదల ప్రాజెక్టులపై ఉద్యమాలు చేయడం కాదు... ముందు చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి, కక్కుర్తికి నీటిపారుదల శాఖ సర్వనాశనం అయ్యిందని ఆరోపించారు. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఏపీకి 512 టీఎంసీలు ఇవ్వాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఒప్పుకున్నారా లేదా? చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆదివారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయా...? ఆ ప్రాజెక్టు కోసం రూ.27 వేల కోట్లు ఖర్చుపెట్టి.. రూ.50 వేల కోట్లకు అంచనాలను మీరే సవరించారు. ఏ విధంగా 90 శాతం పూర్తయినట్లు? మేము అధికారంలోకి వ చ్చాక రూ.7 వేల కోట్లు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించాం. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగానే 2023లోనే కేంద్రం వెనక్కి పంపింది. అప్పట్లో సీఎంగా, నీటిపారుదలశాఖ మంత్రిగా ఎవరున్నారు? ఈ ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలకు తగ్గకుండా నీరివ్వాలని ట్రైబ్యునల్‌ను అడుగుతున్నాం. మీలాగా మోసం చేసే అలవాటు లేదు’ అని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని మీరు రాసిస్తే, 500 టీఎంసీలకంటే ఎక్కువ ఇవ్వాలని ట్రైబ్యునల్ లో తాము కొట్లాడుతున్నామని చెప్పారు. నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరోక్షంగా సహాయం చేసి, తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు. 2004-14 మధ్య శ్రీశైలం నుంచి ఏపీ 727 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతే.. 2014-23 మధ్య 1,442 టీఎంసీలు తరలించుకుపోయిందని తెలిపారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ 90ు అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి కేసీఆర్ నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఆయన నోరు జారితే అంతకంటే ఎక్కువ నోరు తాము కూడా జారుతామని హెచ్చరించారు. నీటిపారుదల విభాగంలో కేసీఆర్ పాలించిన పదేళ్లలోనే నిర్లక్ష్యం జరిగిందని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కాదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చుపెట్టి.. రైతాంగానికి, ప్రజలకు చేసిన ప్రయోజనం శూన్యమని విమర్శించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్లు పెడితే... కొత్త ఆయకట్టు లక్ష ఎకరాలు కూడా రాలేదని మండిపడ్డారు. రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పనులకు రూ.1,550 కోట్లు వెచ్చిస్తే.. 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేదని అన్నారు. ఆ ప్రాజెక్టుల స్థానంలో సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టి... రూ.18 వేల కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు.. ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎందుకు పూర్తి చేయలేదో నల్లగొండ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా ముందుకు వచ్చేటప్పుడు మంచిగా ప్రిపేర్ అవ్వాలని కేసీఆర్‌కు ఉత్తమ్ చురకలంటించారు. రాష్ట్రంలో అత్యధికంగా వరి పంట సాగైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనేనని తెలిపారు.