Minister Uttam Kumar Reddy: ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయింది బీఆర్‌ఎస్సే
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:06 AM
ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయి... నీళ్లు అమ్ముకోవడమే కాకుండా కాంట్రాక్టులన్నీ కట్టబెట్టింది బీఆర్‌ఎస్సేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు..
నీళ్లు అమ్ముకున్నారు.. కాంట్రాక్టులు కట్టబెట్టారు
పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయలేదేం?
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినందుకు సిగ్గుపడాలి
హరీశ్‌రావు.. పేరును గోబెల్స్‌రావుగా మార్చుకోవాలి
మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయి... నీళ్లు అమ్ముకోవడమే కాకుండా కాంట్రాక్టులన్నీ కట్టబెట్టింది బీఆర్‌ఎస్సేనని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు పిలవక ముందే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉంటే.. దాన్ని వాయిదా వేయించి, ఏపీకి మేలు చేసిందెవరు? అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయించామన్నారు. కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే... అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చేందుకు ఒప్పుకొని అపెక్స్ కౌన్సిల్ మినిట్స్‌పై సంతకాలు చేసిందెవరు? అని నిలదీశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. పాలమూరు పథకానికి నీటి కేటాయింపులపై ట్రైబ్యునల్ స్పష్టత ఇచ్చే వరకూ డీపీఆర్‌ను ఆమోదించేది లేదని, 2023 ఏప్రిల్‌లోనే (బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా) సీడబ్ల్యూసీ లేఖ రాసిందని గుర్తు చేశారు. పనులు చేపట్టకుండానే 90 టీఎంసీలు కేటాయిస్తూ జీవో జారీ చేయడంతో ఏపీ ప్రభుత్వం కేసులు వేసి..ప్రాజెక్టును సంక్లిష్టం చేసిందన్నారు. 90టీఎంసీలపై వివాదం ఉండటం వల్లే తొలిదశలో 45 టీఎంసీలతో ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని బీఆర్‌ఎస్ కోరినట్లే.. తామూ కోరామన్నారు. కేవలం ఒక్క మోటార్‌ను ఆన్ చేసి... ప్రాజెక్టంతా పూర్తయినట్లు కేసీఆర్, హరీశ్‌రావు బిల్డప్ ఇస్తున్నారని తప్పుపట్టారు. ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయితే... ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఎందుకు ఇయ్యలేదని నిలదీశారు. ప్రాజెక్టులోని నార్లాపూర్-ఏదుల లింక్ కెనాల్ పనులను పూర్తి చేయకుండా వదిలేస్తే తాము అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించామన్నారు. నల్లగొండ జిల్లాకు అన్యాయం చేస్తూ డిండి పథకానికి అనుమతులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కోపంతో బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ పనులు పూర్తి చేయలేదని ఆక్షేపించారు. పదే పదే పచ్చి అబద్ధాలు చెప్పడంలో హరీశ్‌రావు దిట్టఅని, తన పేరును గోబెల్స్‌రావుగా మార్చుకుంటే మంచిదని విమర్శించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019లో పూర్తయితే... ఐదేళ్లలో 165 టీఎంసీలు ఎత్తిపోశారని, అందులో వినియోగించుకున్నది 70 టీఎంసీలు మాత్రమేనని గుర్తు చేశారు. తెలంగాణను తాకట్టుపెట్టి, కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం కట్టారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినందుకు సిగ్గు పడకుండా.. తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు కేసీఆర్ చేసిన అప్పులకు ప్రస్తుతం ఏటా రూ.20వేల కోట్లు కడుతున్నామన్నారు.
చెక్‌డ్యామ్‌లు కూలిన ఘటనలపై విచారణ
పెద్దపల్లి జిల్లాలోని గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు కూలిన ఘటనలపై విచారణ చేపట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నాణ్యత లోపాలతో కూలిపోయాయా? ఎవరైనా ధ్వంసం చేశారా? అనేది గుర్తించాలని సూచించారు. రైతాంగానికి నీటిని అందించడానికి ఉద్దేశించిన చెక్‌డ్యామ్‌లను ఎవరైనా ధ్వంసం చేసినట్లు తేలితే.. కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.