Share News

Minister Uttam Kumar Reddy: పాలమూరు రంగారెడ్డికి బీఆర్‌ఎస్‌ బద్ధ వ్యతిరేకి!

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:55 AM

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్‌ పార్టీ బద్ధ వ్యతిరేకి అని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Minister Uttam Kumar Reddy: పాలమూరు రంగారెడ్డికి బీఆర్‌ఎస్‌ బద్ధ వ్యతిరేకి!

  • ఆ ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం చేయాలని అప్పట్లో చీఫ్‌ ఇంజనీర్‌ను ఆదేశించింది వాస్తవం కాదా?: ఉత్తమ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్‌ పార్టీ బద్ధ వ్యతిరేకి అని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టు పనులను ఆలస్యం (స్లోడౌన్‌) చేయాలంటూ అప్పటి చీఫ్‌ ఇంజనీర్‌ విజయ్‌కుమార్‌రెడ్డిని నాటి కేసీఆర్‌ ప్రభుత్వం ఆదేశించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసి ‘పాలమూరు’ ప్రాజెక్టుకు మాత్రం రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. పాలమూరు సామర్థ్యాన్ని రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించారని.. అటు కాళేశ్వరంలో మాత్రం రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచారని గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డిపై కేసీఆర్‌కు ఎందుకంత వివక్ష అని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో ఉత్తమ్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘2022 ఆగస్టు 18న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ప్రతిపాదించిన మేరకే 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ముందుకుపోతున్నాం. ఆ జీవోలో 45 టీఎంసీలు మైనర్‌ ఇరిగేషన్‌, మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్‌ కింద ప్రతిపాదించారు. గోదావరి డైవర్షన్‌ కింద 45టీఎంసీల నీటి కేటాయింపు అంశంపై బ్రిజేష్‌ ట్రిబ్యునలే నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. దీనితో మైనర్‌ ఇరిగేషన్‌ కింద 45 టీఎంసీల కేటాయింపుపై సీడబ్ల్యూసీకి లేఖ రాశాం. గోదావరి డైవర్షన్‌ కింద వచ్చే 45 టీఎంసీలతో ప్రాజెక్టు రెండో దశను చేపడతాం. మొత్తంగా 90 టీఎంసీల సామర్థ్యంతోనే నిర్మించనున్నాం’’ అని ఉత్తమ్‌ తెలిపారు. ప్రాజెక్టును ప్రస్తుత టర్మ్‌లోనే పూర్తి చేసి పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. పదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం చేతగాని బీఆర్‌ఎస్‌ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - Dec 30 , 2025 | 05:55 AM