Revenue Minister Ponguleti Srinivas Reddy: కొత్త సర్పంచులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:07 AM
నూతనంగా ఎన్నికైన సర్పంచులు రాజకీయలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు...
ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం: మంత్రి పొంగులేటి
కూసుమంచి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు రాజకీయలకు అతీతంగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేసి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీచేసి గెలిచిన ప్రజాప్రతినిధులు బుధవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన పాలకవర్గాలను అభినందించి శాలువాలు కప్పి, మిఠాయీలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందించడమే ప్రజాప్రతినిధుల లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అదేవిధంగా ఓటమిపాలైన అభ్యర్థులు అధైర్యపడొద్దని, ప్రజల్లోనే ఉంటూ సేవలందించాలని ఆయన సూచించారు.