Share News

Minister Jupalli Krishnarao: ఇందిరమ్మ ఇంటికి వితంతువుతో భూమి పూజ

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:32 AM

సమాజంలో ప్రతీ ఒక్కరు మూఢ నమ్మకాలు, దురాచారాలను విడనాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల పరిధిలోని మాచినేనిపల్లి గ్రామంలో.....

Minister Jupalli Krishnarao: ఇందిరమ్మ ఇంటికి వితంతువుతో భూమి పూజ

  • మూఢ నమ్మకాలను వీడాలని మంత్రి జూపల్లి పిలుపు

  • మహిళలు అనవసర ఆర్భాటాలకు వెళ్లొద్దని సూచన

కొల్లాపూర్‌/పాన్‌గల్‌, నవంబరు23(ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రతీ ఒక్కరు మూఢ నమ్మకాలు, దురాచారాలను విడనాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల పరిధిలోని మాచినేనిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చెందిన లక్ష్మీ దేవమ్మ కుమారుడు రాముడు పేరుతో ఇందిరమ్మ ఇల్లు మంజూరయింది. అతడి భార్య గర్భిణి కావడంతో పూజలో పాల్గొనలేదు. దీంతో రాముడు తల్లి లక్ష్మీదేవమ్మను భూమి పూజ చేయాలని మంత్రి జూపల్లి కోరారు. ఆమె వితంతువు అని మంత్రికి చెప్పడంతో.. ఇలాంటి దురాచారాలను కొనసాగించడం మంచిది కాదని చెప్పారు. వృద్ధురాలు లక్ష్మీదేవమ్మతో కొబ్బరికాయ కొట్టించి, ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయించారు. వారి కుటుంబానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటి బేస్‌మెంట్‌ నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేయాలని సెర్ప్‌ అధికారులను ఆదేశించారు. కాగా, మహిళలు అనవసర ఆర్భాటాలకు పోయి రూ.లక్షలు ఖర్చు చేయొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా.. పట్టు చీర, పట్టు పంచె, ఫంక్షన్లు అని పోటాపోటీగా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఎంత సంపాదించినా, ప్రభుత్వం ద్వారా ఎన్ని ఉచితాలు ఇచ్చినా అప్పుల పాలవుతున్నారని చెప్పారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల, పాన్‌గల్‌, చిన్నంబావి మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు చీరలు.. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను జూపల్లి పంపిణీ చేశారు.

Updated Date - Nov 24 , 2025 | 04:32 AM