Minister Tummala Nageswara Rao: పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:48 AM
ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టుగా పసుపు సాగు చేపట్టాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు
జాతీయ పసుపు బోర్డు ఆ బాధ్యత తీసుకోవాలి
రైతుల సంక్షేమానికి కేంద్రం చొరవ తీసుకోవాలి
టర్మరిక్ వ్యాల్యూ చైన్ సదస్సు లో మంత్రి తుమ్మల
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్ర జ్యోతి): ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టుగా పసుపు సాగు చేపట్టాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జాతీయ పసపు బోర్డు ఈ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ, జాతీయ పసుపు బోర్డు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సదస్సు-2025లో పసుపు రైతుల సంక్షేమం, విలువ జోడింపు, ఎగుమతులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్ వ్యవసాయమేనని తమ ప్రభుత్వం నమ్ముతోందని, విజన్ డాక్యుమెంట్-2047లోనూ సాగుకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. రైతుల సంక్షేమానికి రైతులు చొరవ తీసుకోవాలని కోరారు. పసుపు సాగులో నిజామాబాద్, ఆర్మూర్ ప్రాంతాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, ఆర్మూర్ పసుపునకు జీఐ ట్యాగ్ రావడం తెలంగాణ రైతులకు గర్వకారణమన్నారు. పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష మేరకు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైందని, కానీ.. అది పూర్తిస్థాయిలో కార్యాచరణలోకి దిగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో పసుపు సాగు విస్తీర్ణం తగ్గడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక క్వింటాల్ పసుపు ఉత్పత్తికి రూ.8,000-9,000 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్ ధర రూ.12,000 మాత్రమే ఉండడం రైతులను నిరుత్సాహపరుస్తోందన్నారు. అధిక కర్క్యూమిన్ ఉండే విత్తన రకాలను అందించడంతోపాటు నాణ్యమైన టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి, ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టుగా పసుపు ఉత్పత్తికి చర్యలు చేపట్టినప్పుడే రైతుకు లాభం చేకూరుతుందని ఆయన అన్నారు.