Minister Tummala Nageswara Rao: బీఆర్‌ఎస్ గెలిస్తే మళ్లీ అరాచకమే
ABN , Publish Date - Nov 09 , 2025 | 02:49 AM
అవినీతి, అరాచకాలను తట్టుకోలేకనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు...
అభివృద్ధి కోసం కాంగ్రె్‌సను గెలిపించాలి
జూబ్లీహిల్స్ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలి
గత ప్రభుత్వ హయాంలో కమ్మ సామాజిక వర్గాన్ని వేధించిన ఘటనలు మరిచిపోలేదు
టీడీపీ శ్రేణులు ఆత్మగౌరవంతో ఓటేయాలి
ప్రచారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
బంజారాహిల్స్/వెంగళరావునగర్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): అవినీతి, అరాచకాలను తట్టుకోలేకనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలిస్తే మళ్లీ అరాచకం పెచ్చరిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రశాంతమైన హైదరాబాద్ కోసం బీజేపీ, బీఆర్‌ఎ్‌సను తరిమికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంగళరావ్‌నగర్ డివిజన్‌లో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా తుమ్మల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని ఓటర్లను కోరారు. హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఓటమి భయంతోనే సామాజిక మాధ్యమాల్లో బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేయాలంటూ కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లుగా ఫేక్ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కమ్మ సామాజికవర్గానికి ఎవరేంటో తెలుసని, గత ప్రభుత్వ హయాంలో వేధించిన ఘటనలు మరిచిపోలేదన్నారు. బీఆర్‌ఎస్ కపట నాటకాలు ఎలా తిప్పికొట్టాలో టీడీపీ శ్రేణులకు బాగా తెలుసని, ఉప ఎన్నికలో ఆత్మగౌరవంతో ఓటేయాలని కోరారు. అపార్ట్‌మెంట్ వాసులు, విద్యావంతులు పోలింగ్ కేంద్రాలకు రావాలని, ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసినా జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.